రోహిత్‌ను ఇబ్బంది పెట్టింది వీరే..

3 May, 2020 19:11 IST|Sakshi

ముంబై: భారత క్రికెట్‌ జట్టులో ఓపెనర్‌గా చెరగని ముద్ర వేసిన రోహిత్‌ శర్మ తన కెరీర్‌లో అత్యంత ఇబ్బంది పడ్డ క్షణాలను గుర్తు చేసుకున్నాడు. గతంలో పేస్‌ బౌలింగ్‌ ఆడటంలో కొద్దిపాటి ఇబ్బందులకు గురైన రోహిత్‌ శర్మ.. ఆ విభాగంలో ఇద్దరు బౌలర్లు మాత్రం తనకు అత్యంత పరీక్షగా నిలిచారన్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషనల్‌లో టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీతో చాట్‌ చేసిన చేసిన రోహిత్‌.. ఫేవరెట్‌ బౌలర్లు ఎవరనే దానికి సమాధానమిచ్చాడు. ప్రస్తుతం ఉ‍న్న బౌలర్లలో దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసో రబడా, ఆస్ట్రేలియా పేసర్‌ హజిల్‌వుడ్‌లే తన ఫేవరెట్‌ బౌలర్లన్నాడు. అదే సమయంలో  తనను ఎక్కువ ఇబ్బందికి గురి చేసిన బౌలర్లలో డేల్‌ స్టెయిన్‌, బ్రెట్‌ లీలు ముందు వరుసలో ఉన్నారన్నాడు. ఈ ఇద్దరి బౌలింగ్‌లోనే తాను అత్యంత ఇబ్బంది పడినట్లు రోహిత్‌ చెప్పుకొచ‍్చాడు. (‘కుంబ్లే కోసం నా జీవితాన్ని ఇస్తా’)

‘నా వన్డే సిరీస్‌ అరంగేట్రంలో భాగంగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌ కోసం ఐర్లాండ్‌ వెళ్లాను. అక్కడ స్టెయిన్‌ను ఎదుర్కోలేక చాలా ఇబ్బంది పడ్డా. ఆ తర్వాత బ్రెట్‌ లీ బౌలింగ్‌ కష్టంగా అనిపించేది’ అని రోహిత్‌ తెలిపాడు. 2007లో ఐర్లాండ్‌లో జరిగిన ట్రై సిరీస్‌ ద్వారా రోహిత్‌ అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌ ఆరంభంలో జట్టులో చోటు కోసం తీవ్ర ఇబ్బందులు పడిన రోహిత్‌.. ఆపై రెగ్యులర్‌ ఆటగాడిగా మారిపోయాడు. ఓపెనర్‌గా రోహిత్‌ బ్యాట్‌ పట్టుకున్న దగ్గర్నుంచీ అతని కెరీర్‌ గ్రాఫ్‌ దూసుకుపోయింది. వన్డే ఫార్మాట్‌లో మూడు డబుల్‌ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా నిలిచిన రోహిత్‌కు ఈ ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 264గా ఉంది. గతేడాది ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్‌ 81.00 సగటుతో 648 పరుగులు సాధించి టోర్నమెంట్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇప్పటివరకూ 224 వన్డేలు, 108 వన్డేలు, 32 టెస్టులు ఆడిన రోహిత్‌ అన్ని ఫార్మాట్లలో కలిపి 14,029 పరుగులు సాధించాడు. ('రోహిత్‌ ఎదగడానికి ధోనియే కారణం')

మరిన్ని వార్తలు