చివరి ఓవర్‌లో అద్భుతం

1 Nov, 2018 08:50 IST|Sakshi

అబుదాబి: ఆస్ట్రేలియాను వైట్‌వాష్‌ చేసి జోరు మీదున్న పాకిస్తాన్‌ మరోసారి అద్భుతం చేసింది. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో పోరాడి గెలిచింది. హఫీజ్‌, హసన్‌ పోరాట పటిమతో విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన ఉత్కంఠభరిత టీ20 మ్యాచ్‌లో రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఒత్తిడికిలోనై గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకుంది కివీస్‌. 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కో​ల్పోయి 146 పరుగులు చేసింది. (ఆసీస్‌ను వైట్‌వాష్‌ చేశారు..)

టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 10 పరుగులకే ఓపెనర్లు పెవిలియన్‌కు చేరారు. ఆసిఫ్‌ అలీ(24), మహ్మద్‌ హఫీజ్‌(45), సర్ఫరాజ్‌ అహ్మద్‌(34) సమయోచిత బ్యాటింగ్‌తో పాక్‌ కోలుకుంది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించేలా కనిపించింది. 79/2 స్కోరుతో పటిష్ట స్థితిలో ఉన్న కివీస్‌.. పాక్‌ బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. మున్రో (58), టేలర్‌ (42) రాణించినా మిగతా ఆటగాళ్లు విఫలం కావడంతో కివీస్‌ ఓటమి పాలైంది. పాక్‌ బౌలర్‌ హసన్‌ అలీ 3 వికెట్లు పడగొట్టాడు.

చివరి ఓవర్‌ టెన్షన్‌!
కివీస్‌ విజయం సాధించాలంటే చివరి ఓవర్‌లో 17 పరుగులు చేయాలి. ఈ దశలో 18 ఏళ్ల షహీన్‌ ఆఫ్రిదికి హఫీజ్‌ బంతి ఇచ్చాడు. మొదటి బంతికి సింగిల్‌ మాత్రమే ఇచ్చాడు. రెండో బంతిని సౌతీ బౌండరికీ పంపాడు. తర్వాతి బంతికి సింగిల్‌.. నాలుగు, ఐదో బాల్స్‌కు రెండేసి పరుగులు వచ్చాయి. చివరి బంతికి సిక్సర్‌ కొడితే మ్యాచ్‌ టై అవుతుంది. అందరిలోనూ ఒక్కటే టెన్షన్‌. ఏదైనా అద్బుతం జరిగితే తప్పా కివీస్‌ గెలిచే ఛాన్స్‌ లేదు. కానీ బ్యాటింగ్‌ చేస్తున్నది సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ టేలర్‌ కావడంతో ప్రేక్షకులంతా ఉత్కంఠగా వీక్షించారు. అయితే చివరి బాల్‌కు ఫోర్‌ రావడంతో పాకిస్తాన్‌ ఊపిరి పీల్చుకుంది. రెండు పరుగుల తేడాతో సత్తా చాటింది. తనపై కెప్టెన్‌ ఉంచిన నమ్మకాన్ని షహీన్‌ వమ్ముచేయకుండా మ్యాచ్‌ను గెలిపించాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది. హఫీజ్‌ ‘మ్యాన్‌ ది మ్యాచ్‌’ అందుకున్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు