‘నేను ఐసీసీని విమర్శించలేదు’

7 Jun, 2018 14:09 IST|Sakshi

కరాచీ: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) నిబంధనల్ని తాను తప్పుబట్టినట్లు వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని పాకిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ మహమ్మద్‌ హఫీజ్‌ తాజాగా స్పష్టం చేశాడు. కేవలం బౌలింగ్‌ యాక్షన్‌ పరీక్షకు సంబంధించి ఐసీసీ ప్రమాణాలు పెంచుకోవాలని మాత్రమే సూచించడం జరిగిందని హఫీజ్‌ తెలిపాడు. ఈ మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు క్రమశిక్షణా కమిటీకి హఫీజ్‌ వివరణ ఇచ్చాడు.

ఇటీవల ఐసీసీ నిబంధనలపై హఫీజ్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బీబీసీ ఉర్దూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హఫీజ్‌.. ఐసీసీ బౌలింగ్‌ యాక్షన్‌ నిబంధనల్ని తప్పబట్టాడు. బౌలింగ్‌ యాక్షన్‌ వ్యవహారంలో ఐసీసీ పక్షపాతంగా వ్యవహరిస్తుందని, ఐసీసీతో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్న బోర్డు క్రికెటర్లపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించాడు. అనుమానస్పద బౌలింగ్‌ యాక్షన్‌ కలిగి ఉన్న బౌలర్లను పరీక్షించడానికి ఓ విధానాన్ని రూపొందించాలని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు ఐసీసీకి వ్యతిరేకంగా ఉండటంతో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు వివరణ కోరింది. కాగా, తన వ్యాఖ్యాలను సరిదిద్దుకునే క‍్రమంలో హఫీజ్‌.. ఐసీసీకి కేవలం సూచన మాత్రమే ఇచ్చానన్నాడు.

బౌలింగ్‌ యాక్షన్‌కు సంబంధించి ఐసీసీ ప్రమాణాలను పెంచుకుంటే క్రికెట్‌ అభిమానులకు కొన్ని అనుమానాలు నివృత్తి అయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే సలహా ఇచ్చానన్నాడు. అంతేకానీ ఐసీసీ ప్రొటోకాల్స్‌ని అతిక‍్రమించే పని ఎప్పటికీ చేయనన్నాడు. హఫీజ్‌ వివరణపై పీసీబీ క్షమశిక్షణా కమిటీ సంతృప్తి చెందడంతో  ఎటువంటి జరిమానా విధించలేదు.
 

>
మరిన్ని వార్తలు