‘చైనా’ చాంప్‌ హామిల్టన్‌ 

15 Apr, 2019 04:55 IST|Sakshi

షాంఘై: క్వాలిఫయింగ్‌లో వెనుకబడినా... ప్రధాన రేసులో అదరగొట్టిన మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ ఈ సీజన్‌లో రెండో విజయాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన చైనా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్‌ రేసులో హామిల్టన్‌ చాంపియన్‌గా నిలిచాడు. 56 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్‌ గంటా 32 నిమిషాల 06.350 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని అలంకరించాడు. పోల్‌ పొజిషన్‌తో రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్‌ జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్‌ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రధాన రేసు మొదలైన వెంటనే తొలి మలుపులోనే బొటాస్‌ను ఓవర్‌టేక్‌ చేసిన హామిల్టన్‌.

చివరి ల్యాప్‌ వరకు ఈ ఆధిక్యాన్ని కొనసాగించి ఫార్ములావన్‌లో 1000వ రేసుగా జరిగిన చైనా గ్రాండ్‌ప్రిలో ఆరోసారి చాంపియన్‌ అయ్యాడు.ఫెరారీ డ్రైవర్‌ సెబాస్టియన్‌ వెటెల్‌కు మూడో స్థానం దక్కింది. మొత్తం 20 మంది డ్రైవర్లు బరిలోకి దిగగా... ముగ్గురు డ్రైవర్లు లాండో నోరిస్‌ (మెక్‌లారెన్‌), డానిల్‌ క్వియాట్‌ (ఎస్టీఆర్‌), హుల్కెన్‌బర్గ్‌ (రెనౌ) రేసు ముగించకుండానే మధ్యలో వైదొలిగారు. ఈ సీజన్‌లో మూడు రేసుల తర్వాత హామిల్టన్‌ (68 పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా... బొటాస్‌ (62 పాయింట్లు) రెండో స్థానంలో, వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌–39 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రి ఈనెల 28న జరుగుతుంది.    

మరిన్ని వార్తలు