హామిల్టన్‌కే పోల్

29 Mar, 2015 02:40 IST|Sakshi
హామిల్టన్‌కే పోల్

మలేసియా గ్రాండ్‌ప్రి
కౌలాలంపూర్: ఓవైపు వర్షం.. మరోవైపు సహచరుల నుంచి గట్టిపోటీ... అయినా మలేసియా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ జోరు కొనసాగించాడు. తడిగా ఉన్న ట్రాక్‌పై పట్టు జారకుండా ఇంటర్మీడియట్ టైర్లతో కారును నడిపి ఈ సీజన్‌లో వరుసగా రెండోసారి పొల్ పోజిషన్‌ను దక్కించుకున్నాడు.

క్యూ-3లో 13వ ల్యాప్‌ను హామిల్టన్ అత్యంత వేగవంతంగా 1ని. 49,834 సెకన్ల టైమింగ్‌తో ముగించాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసులో హామిల్టన్ తొలిస్థానం నుంచి రేసును మొదలుపెడతాడు. ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ (1ని.49,908 సెకన్లు) రెండో స్థానంలో, మెర్సిడెస్ డ్రైవర్ నికో రోస్‌బర్గ్ (1ని. 50,299 సెకన్లు) మూడో స్థానంలో నిలిచారు.

క్వాలిఫయింగ్ ముగింపు దశల్లో హామిల్టన్, రోస్‌బర్గ్‌లే ముందు స్థానాల్లో ఉన్నా.. ఊహించని రీతిలో వెటెల్ రెండో స్థానానికి దూసుకొచ్చాడు. రెడ్‌బుల్ డ్రైవర్లు రికార్డో (1ని.51,541 సెకన్లు), డానిల్ యాట్ (1ని. 51,950 సెకన్లు)లు వరుసగా నాలుగు, ఐదు స్థానాలను సాధించారు. మ్యాక్స్ వెర్‌స్టాపెన్ (టోరో రోసో-1ని. 51,980 సెకన్లు), ఫెలిప్ మసా (విలియమ్స్-1ని. 52,473 సెకన్లు), గ్రోస్యెన్ (లోటస్-1ని. 52,980 సెకన్లు), బొటాస్ (విలియమ్స్-1ని. 53,179 సెకన్లు), ఎరిక్సన్ (సాబెర్-1ని. 53,260 సెకన్లు) తర్వాతి ఐదుస్థానాలతో సరిపెట్టుకున్నారు. మీడియం టైర్లతో కార్లను నడిపిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు నికో హుల్కెన్‌బర్గ్, సెర్గియో పెరెజ్‌లు వరుసగా 13, 14 స్థానాల్లో నిలిచారు.
 
మలేసియా గ్రాండ్‌ప్రి
ల్యాప్‌ల సంఖ్య: 56; సర్క్యూట్ పొడవు: 5.543 కి.మీ. రేసు దూరం: 310. 408 కిలోమీటర్లు
గత విజేత: హామిల్టన్

మరిన్ని వార్తలు