ఆధిక్యంలో హంపి 

17 Feb, 2020 08:55 IST|Sakshi

కెయిన్స్‌ కప్‌ చెస్‌ టోర్నీ

సెయింట్‌ లూయిస్‌ (అమెరికా): ఈ ఏడాది తొలి టైటిల్‌కు ఆంధ్రప్రదేశ్‌ చెస్‌ గ్రాండ్‌మాస్టర్, భారత మహిళల నంబర్‌వన్‌ కోనేరు హంపి విజయం దూరంలో ఉంది. కెయిన్స్‌ కప్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ఎనిమిదో రౌండ్‌ తర్వాత హంపి 5.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో నిలిచింది. వాలెంటినా గునీనా (రష్యా)తో జరిగిన ఎనిమిదో రౌండ్‌ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హంపి 35 ఎత్తుల్లో విజయం సాధించింది. చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారికతో హంపి తలపడుతుంది. ఈ గేమ్‌లో హంపి గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా విజేతగా అవతరిస్తుంది. మరోవైపు హారిక ఈ టోర్నీలో ఆరో ‘డ్రా’ నమోదు చేసుకుంది.

హారిక
ప్రపంచ మాజీ చాంపియన్‌ మరియా ముజిచుక్‌ (ఉక్రెయిన్‌)తో జరిగిన ఎనిమిదో రౌండ్‌ గేమ్‌ను హారిక 58 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఎనిమిదో రౌండ్‌ తర్వాత హంపి 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... ఐదు పాయింట్లతో ప్రపంచ మాజీ చాంపియన్‌ అలెగ్జాండ్రా కొస్టెనిక్‌ (రష్యా) రెండో స్థానంలో, 4.5 పాయింట్లతో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ జూ వెన్‌జున్‌ (చైనా), మరియా ముజిచుక్‌ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. నాలుగు పాయింట్లతో హారిక ఆరో స్థానంలో ఉంది. పాయింట్ల పరంగా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అగ్రస్థానంలో నిలిస్తే ప్లే ఆఫ్‌ గేమ్‌ల (ర్యాపిడ్, బ్లిట్జ్, అర్మగెడాన్‌) ద్వారా ఏకైక విజేతను నిర్ణయిస్తారు.   

మరిన్ని వార్తలు