చెస్‌ ఒలింపియాడ్‌కు హంపి, హారిక, ఆనంద్‌ 

7 Mar, 2020 02:08 IST|Sakshi

చెన్నై: ప్రతిష్టాత్మక చెస్‌ ఒలింపియాడ్‌లో ఈసారీ భారత్‌ పూర్తి బలగంతో బరిలోకి దిగనుంది. మహిళల విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక ప్రాతినిధ్యం వహించనున్నారు. జట్టులోని మిగతా మూడు బెర్త్‌ల కోసం తానియా సచ్‌దేవ్, భక్తి కులకర్ణి, ఆర్‌.వైశాలి రేసులో ఉన్నారు. అయితే మే 1వ తేదీన మిగతా ముగ్గురు క్రీడాకారిణుల పేర్లను ఖరారు చేస్తామని అఖిల భారత చెస్‌ సమాఖ్య (ఏఐసీఎఫ్‌) ఒక ప్రకటనలో తెలిపింది. పురుషుల విభాగంలో భారత నంబర్‌వన్, ప్రపంచ మాజీ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ పేరు ఖరారైంది. ర్యాంకింగ్‌ ప్రకారం పెంటేల హరికృష్ణ, విదిత్‌ ఎంపిక కూడా లాంఛనమే. మిగతా రెండు బెర్త్‌ల కోసం ఆధిబన్, కృష్ణన్‌ శశికిరణ్, సేతురామన్, సూర్యశేఖర గంగూలీ, అరవింద్‌ చిదంబరం రేసులో ఉన్నారు. చెస్‌ ఒలింపియాడ్‌ ఈ ఏడాది ఆగస్టు 5 నుంచి 18 వరకు రష్యా రాజధాని మాస్కోలో జరుగుతుంది. మొత్తం 180 దేశాలు ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొంటున్నాయి.

మరిన్ని వార్తలు