‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం

29 Jun, 2013 07:07 IST|Sakshi
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం

‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం
 టోర్నీలో అజేయంగా నిలిచిన తెలుగు తేజం  
 హారికకు ఎనిమిదో స్థానం
 
 దిలిజాన్ (అర్మేనియా): ఆద్యంతం స్థిరమైన ప్రదర్శన కనబరిచిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తన కెరీర్‌లో మరో గ్రాండ్‌ప్రి టైటిల్‌ను కైవసం చేసుకుంది. శుక్రవారం ముగిసిన ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో హంపి ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మొత్తం 12 మంది అగ్రశ్రేణి క్రీడాకారిణులు పాల్గొన్న ఈ మెగా ఈవెంట్‌లో హంపి అజేయంగా నిలవడం విశేషం. టోర్నీ మొత్తంలో ఐదు విజయాలు నమోదు చేసిన ఈ విజయవాడ అమ్మాయి మిగతా ఆరు గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది.
 
  శుక్రవారం జరిగిన చివరిదైన 11వ రౌండ్‌లో హంపి కేవలం 22 ఎత్తుల్లో తువ్‌షిన్‌తుగ్స్ బచిమెగ్ (మంగోలియా)పై విజయం సాధించింది. ఏడు పాయింట్లతో అనా ముజిచుక్ (స్లొవేనియా) రెండో స్థానంలో నిలువగా... నానా జాగ్‌నిద్జె (జార్జియా) మూడో స్థానాన్ని సంపాదించింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 5 పాయింట్లతో 8వ స్థానంతో సంతృప్తి పడింది. చివరి రౌండ్‌లో స్టెఫనోవా (బల్గేరియా)తో జరిగిన గేమ్‌ను హారిక 69 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఈ టోర్నీలో హారిక ఒక గేమ్‌లో నెగ్గి, రెండు గేముల్లో ఓడి మిగతా ఎనిమిది గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది.
 
 

మరిన్ని వార్తలు