రెండో రౌండ్‌లో హంపి

5 Nov, 2018 01:58 IST|Sakshi

టైబ్రేక్‌లో హారిక, పద్మిని భవితవ్యం  

ఖాంటీ మన్‌సిస్క్‌ (రష్యా): ప్రపంచ మహిళల చెస్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. హయత్‌ తుబాల్‌ (అల్జీరియా)తో ఆదివారం జరిగిన రెండో గేమ్‌లో నల్ల పావులతో ఆడిన హంపి 46 ఎత్తుల్లో విజయం సాధించింది. దాంతో హంపి 2–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. శనివారం జరిగిన తొలి గేమ్‌లోనూ హంపి గెలిచిన సంగతి తెలిసిందే. సోపికో ఖుఖాష్‌విలి (జార్జియా)తో జరిగిన రెండో గేమ్‌ను ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక 60 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది.

దాంతో వీరిద్దరి స్కోరు 1–1తో సమమైంది. సోమవారం జరిగే టైబ్రేక్‌లో వీరిద్దరి మధ్య విజేతను నిర్ణయిస్తారు. జన్‌సాయా అబ్దుమలిక్‌ (కజకిస్తాన్‌)తో జరిగిన రెండో గేమ్‌నూ భారత్‌కే చెందిన పద్మిని రౌత్‌ 76 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. స్కోరు 1–1తో సమం కావడంతో సోమవారం వీరిద్దరి మధ్య టైబ్రేక్‌ను నిర్వహిస్తారు. నటాలియా పొగోనినా (రష్యా)తో జరిగిన తొలి గేమ్‌లో ఓడిపోయిన భారత క్రీడాకారిణి భక్తి కులకర్ణి... ఆదివారం జరిగిన రెండో గేమ్‌ను 53 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని ఓవరాల్‌గా 0.5–1.5తో ఓడిపోయింది.   

మరిన్ని వార్తలు