జయహో..!

19 Apr, 2019 13:21 IST|Sakshi
సురేష్, క్రీడాకారుడు

అర చేతులు లేవు

చెదరని ఆత్మస్థైర్యంతో అబ్బురం

అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించాలన్నదే లక్ష్యం

అతనో దివ్యాంగుడు. రెండు అరచేతులు లేకుండా మొండి చేతులతో విధికి ఎదురీదాడు. బ్రహ్మరాతను మార్చేశాడు. కష్టాల వారధిని దాటేశాడు. ఒక వైపు చదువు.. మరో వైపు ఫుట్‌బాల్‌.. బాస్కెట్‌బాల్‌.. లాంగ్‌ జంప్‌.. రన్నింగ్‌.. బైక్‌ రైడింగ్‌.. ఇలా అన్నింటా అద్భుతమైన ప్రదర్శన. ఎవరికి తానేమి తక్కువ కాదని నిరూపించాడు సురేష్‌.  నేనున్నానంటూ తల్లికి సైతం అండగా ఉంటూ శభాష్‌ అనిపించుకుంటున్నాడు. నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అతని పోరాటాన్ని దర్శించిన దైవం తలదించగా.. అతని సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తి జై కొట్టింది.

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): మర్రిపాడు మండలం అల్లంపాడుకు చెందిన తుపాకుల పోలయ్య, సునీత దంపతులు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ నెల్లూరు నగరానికి వలస వచ్చారు. బీవీనగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. వీరికి బాలకృష్ణ, సురేష్, పుల్లయ్య ముగ్గురు కొడుకులు. బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని భారంగా నెట్టుకొస్తున్నారు.  2013లో వినాయక చవితి వేడుకలు సురేష్‌ జీవితంలో విషాదాన్ని నింపాయి. అప్పుడు సురేష్‌ కేఎన్‌ఆర్‌ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నాడు. ప్రమాదవశాత్తూ టపాసు చేతుల్లో పేలడంతో రెండు చేతుల అరచేతులు పూర్తిగా కాలిపోయాయి.  మొండి చేతులు మిగిలాయి. సురేష్‌ బాధ వర్ణణాతీతంగా మారింది. తన స్నేహితులు బడికి వెళ్తుంటే దుఃఖంతో రెండేళ్లకు పైగా ఇంట్లోనే ఉండిపోయాడు.

తల్లి బిడ్డకు మరోజన్మను ప్రసాదించేందుకు సకల ప్రయత్నాలు చేసింది. తాను కూలీ పనికి వెళ్తూ సురేష్‌కు మరోసారి పాదాలతో అక్షరాభ్యాసం చేయించాల్సి వచ్చింది. రాయడం నేర్చుకున్న తర్వాత ప్రగతి ఛారిటీస్‌ నిర్వాహకులు సురేష్‌కు సహకారం అందించారు. సుగుణ కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు కిరణ్‌ దంపతులు సురేష్‌కు ఉచితంగా చదువు చెప్పారు. పదో తరగతిలో 5.2 పాయింట్లతో ఉత్తీర్ణత సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ లోపు కేఎన్‌ఆర్‌ స్కూల్‌ పీఈటీ అజయ్‌కుమార్‌ సురేష్‌లో ఉన్న ప్రతిభను గుర్తించాడు. క్రీడల్లో శిక్షణ ఇస్తూనే ఆర్థికంగా సహాయం చేస్తూ సురేష్‌కు అండగా నిలిచాడు.  ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం విద్యను పూర్తి చేయడంలో శ్రీ వెంకటేశ్వర కళాశాల కరస్పాండెంట్‌ సునీల్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

క్రీడలపై ఆసక్తి
చదువుతో పాటు క్రీడలపై సురేష్‌ ఆసక్తి పెంచుకున్నాడు. స్నేహితులతో కలిసి క్రీడల్లో పాల్గొనేవాడు. ఏసీసుబ్బారెడ్డి స్టేడియంలో కోచ్‌లు జెస్సీం, రజనిలు సురేష్‌ ఆసక్తిని గమనించి అథ్లెటిక్స్‌లో శిక్షణ ఇచ్చారు. కోచ్‌లందరు ఆయా క్రీడల్లో తమ వంతు సహాయ సహకారాలను అందించారు. దీంతో సురేష్‌ ఫుట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్‌లో ప్రావీణ్యం సా«ధించారు. అధ్లెటిక్స్‌లో పరుగుల్లో తన సత్తాను చాటాడు.

జాతీయస్థాయిలో ప్రతిభ
గతేడాది విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో, విజయవాడలో జరిగిన పారామెడికల్‌ పోటీల్లో సురేష్‌ ప్రతిభ కనబరిచాడు. ఆ విజయంతో త్వరలో అంతర్జాతీయ స్థాయిలో దుబాయ్‌లో జరిగే పోటీల కోసం ప్రస్తుతం శ్రమిస్తున్నాడు.

వెంటాడుతున్నఆర్థిక ఇబ్బందులు
ప్రతిభతో రాణిస్తున్న సురేష్‌కు అవకాశాలు వస్తున్నాయి. అయితే ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. స్పాన్సర్ల కోసం ఎదురు చూపులు చూడాల్సి వస్తోంది. అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనాలంటే అయ్యే ఖర్చులు, ఆ స్థాయి  సాధనకు సరిపడే పౌష్టికాహారం తనకు అందుబాటులో లేని పరిస్థితులు. అనారోగ్యం కారణంగా తండ్రి బేల్దారీ పని మానేయాల్సి వచ్చింది. తమ్ముడు పనికి పోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ స్థాయిలో తనను తాను నిరూపించుకోవడానికి దాతల సహాయం ఎంతైనా అవసరం ఉంది.

అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి
క్రీడాకారుడిగా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలి. రైల్వేస్‌లో ఉద్యోగం పొంది కుటుంబానికి అండగా నిలవాలనేది జీవిత లక్ష్యం. డ్యాన్స్‌ డైరెక్టర్, దర్శకుడు లారెన్స్‌ దర్శకత్వంలో నటించాలని కోరిక. దేవుడే తీరుస్తాడేమో చూడాలి. చేతులు లేవనే దిగులు పడటం లేదు. నాపై జాలి చూపడం సైతం నచ్చదు. విధిని ఎదురించి మనమేంటో నిరూపించాలి.

మరిన్ని వార్తలు