‘మతం వద్దు.. మానవత్వమే ముద్దు’

2 Apr, 2020 19:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: విమర్శకులు తనపై చేస్తున్న ఆరోపణలపై టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ స్పందించాడు. ఈ సందర్భంగా ట్విటర్‌లో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేశాడు. ‘కులం వద్దు, మతం వద్దు కేవలం మానవత్వమే ముద్దు. కానీ కొందరు చేస్తున్నది ఏమిటి?. ద్వేషం, వైరస్‌ను వ్యాపింపచేయకండి.. ప్రేమను పంచండి. ప్రతీ ఒక్కరి కోసం ప్రార్థన చేద్దాం. భగవంతుడి ఆశీస్సులు మనందరిపై ఉంటాయి. అందరూ దయ కలిగి ఉండండి. ఇంట్లోనే ఉండండి సురక్షితంగా ఉండండి’ అంటూ భజ్జీ ట్వీట్‌ చేశాడు. దీంతో విమర్శకుల నోటికి తాళం పడింది. 

కాగా, తమ దేశంలో కరోనాపై పోరాటంలో భాగంగా పాకిస్తాన్‌ మాజీ సారథి షాహిద్‌ ఆఫ్రిది తన ఫౌండేషన్‌ ద్వారా సహాయం చేస్తున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పాక్‌ దేశ పౌరులకు మందులు, ఆహారం ఉచితంగా అందిస్తున్నాడు. ఈ క్రమంలో అఫ్రిది చేస్తున్న గొప్ప పనిని అభినందిస్తూ ఫౌండేషన్‌కు విరాళాలు అందించండి అంటూ టీమిండియా ఆటగాళ్లు యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌లు నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. అయితే మానవతా దృక్పథంతో వారు చేసిన పనికి విమర్శకులతో పలువురు నెటిజన్ల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఆ విమర్శలపై యువీ స్పందించాడు. తాను ఎప్పటికీ భారతీయుడేనని, కష్టకాలంలో ఉంటే తనకు హానీ చేసిన వారికైన సహాయం చేస్తానని యువీ పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా భజ్జీ సైతం తనపై వస్తున్న విమర్శలను తిప్పి కొట్టాడు.

చదవండి:
ఆఫ్రిదికి సాయం: విమర్శకులపై యువీ ఫైర్‌
‘గంగూలీ కోసం లక్ష్మణ్‌ను తప్పించాను’

మరిన్ని వార్తలు