ధోని చివరి మ్యాచ్‌ ఆడేశాడా?

16 Jan, 2020 18:22 IST|Sakshi

టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన సారథి.. బెస్ట్‌ ఫినిషర్‌గా ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు.. మైదానంలో లైట్‌ కంటే వేగంగా కదులుతూ ఎన్నో మ్యాచ్‌లను మలుపు తిప్పిన యోధుడు.. ఎంతో మంది యువ క్రికెటర్ల మార్గం చూపిన మార్గదర్శకుడు.. కూల్‌గా ఉంటూ వ్యూహాలు రచించడంలో క్రికెట్‌లో అపర చాణక్యుడు.. టీమిండియా భవిష్యత్‌లో ప్రస్తుత లంక పరిస్థితి రాకూడదని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న అపర మేధావి.. అతడే జార్ఖండ్‌ డైనమెట్‌ మహేంద్ర సింగ్‌ ధోని

సీన్‌ కట్‌ చేస్తే టీమిండియా క్రికెట్‌లో మకుంటం లేని మహారాజుగా ఎదిగిన ధోనికి తాజాగా ప్రకటించిన బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌ జాబితాలో చోటు దక్కలేదు. దీంతో ధోని శకం ముగిసినట్టేనని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లండ్‌ వేదికగా ముగిసిన ప్రపంచకప్‌ అనంతరం నుంచి ధోని మళ్లీ మైదానంలో దిగలేదు. అలా అని రిటైర్మెంట్‌ ప్రకటించలేదు. దీంతో ధోని భవిష్యత్‌పై అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. అయితే పొమ్మనలేక పొగపెట్టినట్లు కాంట్రాక్ట్‌ జాబితా నుంచి తొలగించి ధోనిని సాగనంపేందుకు బీసీసీఐ చర్యలు తీసుకుందని ముక్తకంఠంతో అందరూ పేర్కొంటున్నారు. అయితే ఇదే అభిప్రాయాన్ని క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ కూడా వ్యక్తం చేశాడు.

‘బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌ జాబితా చూశాక ధోని చివరి మ్యాచ్‌ ఆడేశాడా అనే అనుమానం కలిగింది. ప్రపంచకప్‌ తర్వాత ధోని మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టలేదు. టీమిండియా తరుపున ఆడలేదు. అంతేకాకుండా టీమిండియా సెలక్షన్స్‌కు అందుబాటులో లేడు. ఇక ఐపీఎల్‌లో ధోని నుంచి మనం అద్భుతమైన ఆటను తప్పకుండా చూస్తాం. ఎందుకంటే అతడు అడే ప్రతీ మ్యాచ్‌లో ఆటగాడిగా వంద శాతం ప్రూవ్‌ చేసుకోవాలనుకుంటాడు. అయితే ఐపీఎల్‌లో ధోని అద్భుతంగా ఆడినా అతడు టీమిండియా తరుపున ఆడతాడనే నమ్మకం లేదు. నాకు తెలిసి వన్డే ప్రపంచకప్‌ అతడి చివరి టోర్నీ. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచే బహుశా అతడి చివరి మ్యాచ్’ అంటూ హర్భజన్‌ పేర్కొన్నాడు. 

ఇక తన కెరీర్‌ గురించి కూడా హర్భజన్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నా కెరీర్‌ 2000లోనే ముగియాలి. కానీ సౌరవ్‌ గంగూలీ ఇచ్చిన ధైర్యం, సపోర్ట్‌తోనే నేను టీమిండియాకు సుదీర్ఘంగా సేవలందించగలిగాను. నా మీద నాకంటే గంగూలీకే ఎక్కువ నమ్మకం ఉండేది. అందుకే ప్రోత్సహించాడు. లేకుంటే నా స్నేహితుల మాదిరి విదేశాల్లో స్థిరపడిపోయేవాడిని. 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌తో తన తలరాత మారిపోయింది’ అని హర్భజన్‌ వివరించాడు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా