‘ఖేల్‌ రత్న’ తిరస్కరణ: భజ్జీ ఆవేదన 

31 Jul, 2019 15:25 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘ఖేల్‌ రత్న’ అవార్డు కోసం టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ పెట్టుకున్న నామినేషన్‌ను ఇటీవల కేంద్ర క్రీడలు, యువజన వ్యవహరాల మంత్రిత్వశాఖ తిరస్కరించిన సంగతి తెలిసిందే. హర్భజన్‌ నామినేషన్‌ పత్రాలు ఆలస్యంగా రావడంతో ఆయన నామినేషన్‌ను కేంద్రం తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 39 ఏళ్ల ఈ క్రికెటర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశాడు. దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారమైన ‘ఖేల్‌ రత్న’ కోసం తాను గడువులోపలే అన్ని పత్రాలు సమర్పించానని, ఈ విషయంలో ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుందని, ఈ అంశాన్ని మరోసారి పరిశీలించాలని పంజాబ్‌ క్రీడాశాఖ మంత్రి రాణా గుర్మీత్‌ సింగ్‌ సోధీని భజ్జీ ఈ వీడియోలో కోరారు.

తన నామినేషన్‌ పత్రాలు కేంద్రానికి ఆలస్యంగా అందడంతో తన పేరును ఈసారి ‘ఖేల్‌ రత్న’ కోసం పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలిసిందని పేర్కొన్నారు. ఇలాంటి పరిణామాలు క్రీడాకారులను నిరుత్సాహపరుస్తాయని, తమను పట్టించుకోవడం లేదన్న భావన కలిగిస్తాయని భజ్జీ పేర్కొన్నారు. నిజానికి మార్చి 20నే తన ప్రతాలను సమర్పించానని, తన పత్రాలు కేంద్రానికి ఎందుకు ఆలస్యంగా వెళ్లాయో అర్థం కావడం తెలిపారు. తమ సేవలను గుర్తించి అవార్డులు ఇవ్వడం.. క్రీడాకారులకు గొప్ప ప్రోత్సాహం కల్పిస్తుందని, పంజాబ్‌ క్రీడాశాఖ ఇప్పటికైనా తన పత్రాలను కేంద్రానికి పంపాలని కోరారు. 
 

మరిన్ని వార్తలు