టీమిండియా ఓటమికి కారణం అతడే: భజ్జీ

5 Sep, 2018 19:48 IST|Sakshi

సాక్షి, స్పోర్ట్ట్స్‌: అభిమానులు ఎన్నో అంచనాలు తలకిందులు చేస్తూ ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను టీమిండియా చేజార్చుకుంది. ఈ సిరీస్‌లో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి మినహా ఎవ్వరూ వారి స్థాయికి తగ్గ ప్రదర్శనం కనబర్చలదు. గెలవడం పక్కకు పెడితే కనీస పోరాట స్ఫూర్తి ఆటగాళ్లలో కనిపించలేదని మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఇప్పటికే టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాళ్లు సునీల్‌ గవాస్కర్‌, సౌరవ్‌ గంగూలీలు ఆటగాళ్లు ఆటతీరు, కోచింగ్‌ సిబ్బందిపై విమర్శనాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. తాజాగా భారత్ ఆఫ్‌ స్పిన్నర్‌, సీనియర్‌ ఆటగాడు హర్భజన్‌ సింగ్‌ సిరీస్‌ ఓటమికి గల కారణాలను పేర్కొన్నాడు. టెస్టు సిరీస్‌ ఓడిపోవడానికి స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్వినే కారణమని విమర్శించాడు.

పసలేని బౌలింగ్‌..
‘రవిచంద్రన్‌ అశ్విన్‌ పసలేని బౌలింగ్‌తోనే టీమిండియా ఓడిపోయింది. సౌతాంప్టన్‌ మైదానం ఆఫ్‌ స్పిన్నర్లకు ఎంతో అనుకూలించినా అశ్విన్‌ సరిగ్గా ఉపయోగించుకోలేదు. పిచ్‌ను, బ్యాట్స్‌మెన్‌ను అంచనావేయడంలో అశ్విన్‌ విఫలమయ్యాడు. ప్రత్యర్థి స్పిన్నర్‌ మొయిన్‌ అలీ తొమ్మిది వికెట్లు పడగొడితే.. మన స్పిన్నర్‌ కేవలం మూడు వికెట్లే తీశాడంటే అర్థం చేసుకోవచ్చు. స్పిన్నర్‌ ప్రభావం చూపకపోవడంతో లోయార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పరుగులు రాబట్టాడు. సరైన సమయంలో వికెట్లు తీయకపోవడం వల్లనే టీమిండియా సిరీస్‌ కోల్పోయింది. దీంతో అశ్విన్‌ విదేశీ పిచ్‌లపై ఏమాత్రం ప్రభావం చూపలేడని మరోసారి అర్థమైంది. మూడో టెస్టులో గాయపడిన అశ్విన్‌ను.. పూర్తిగా కోలుకోకముందే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నాలుగో టెస్టులో ఆడించిందా?. ఒకవేళ గాయం నుంచి పూర్తిగా కోలుకోకున్నా ఈ స్థాయిలో బౌలింగ్‌ చేస్తే అభినందిస్తా’నని భజ్జీ పేర్కొన్నాడు.  

అలీపై ప్రశంసలు..
తొమ్మిది వికెట్లు తీసి ఇంగ్లండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ ఆలీపై భజ్జీ ప్రశంసల వర్షం కురిపించాడు. గాయం నుంచి కోలుకొని ఇలాంటి అద్భుత ప్రదర్శన చేయడం అభినందనీయమని కొనియాడాడు. మొయిన్‌ అలీ ఇదే మైదానంలో 2014లో ప్రదర్శనకి, ప్రస్తుత ప్రదర్శనకి చాలా వ్యత్యాసం ఉందని, ఎంతో పరిణితి సాధించాడని అభిప్రాయపడ్డాడు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అలీ ప్రదర్శన తనను ఎంతగానో ఆకట్టుకుందని వివరించాడు.
 

మరిన్ని వార్తలు