ఆ గొప్పతనం ధోనిలో ఉంది : హర్భజన్‌ సింగ్‌

21 Feb, 2018 15:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిపై ఆ జట్టు స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ పొగడ్తల వర్షం కురిపించాడు. ధోనితో కలిసి మైదానంలో ఆడటానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని అన్నాడు. ధోనితో కలిసి ఆడటం గొప్ప అనుభూతి అని, చెన్నైకి ట్రోఫీ అందించడమే తమ ఇద్దరి లక్ష్యమని అన్నాడు. ధోని ఆటను చాలా వేగంగా, స్మార్ట్‌గా అర్థం చేసుకుంటాడని, టీ20 మ్యాచ్‌ల్లో అతను మరింత స్మార్ట్‌గా ఆలోచిస్తాడని, అది అతని ఉన్న గొప్ప లక్షణంగా బజ్జీ అభివర్ణించాడు.

పదేళ్లు ముంబైతో కలిసి ఆడటాన్ని ఎంతో ఆస్వాదించానని, ఇప్పుడు చెన్నై కోసం మరింత కష్టపడతానంటూ వ్యాఖ్యానించిచాడు. పదేళ్లపాటు  ఐపీఎల్‌లో బలమైన ముంబై జట్టుతో పని చేశానని, ఈ ఏడాది నుంచి మరో బలమైన జట్టుకు ఆడటం చాలా సంతోషంగా ఉందన్నాడు. ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్ రెండు జట్టు అత్యుత్తమ జట్లని, వాటి మద్య జరిగే మ్యాచ్‌ అంటే వత్తిడి ఉంటుందని, రెండు జట్లు విజయం కోసం తుది వరకూ పోరాడగల సత్తా ఉందని అభిప్రాయ పడ్డాడు.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ రెండు ఏళ్లపాటు నిషేధాన్ని ఎదుర్కొన్ని ఇటీవలే తిరిగి ఐపీఎల్‌లోకి వచ్చింది. అంతేకాకుండా రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన ధోనినే తమ కెప్టెన్‌గా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. వరుసగా పదేళ్లపాటు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన హర్భజన్‌ సింగ్‌ ఈ ఏడాది చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడనున్నాడు. ఐపీఎల్‌ 11 సీజన్‌ ఏప్రిల్‌ 7న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య ముంబై వాంఖడే స్టేడియంలో జరగనుంది.

మరిన్ని వార్తలు