‘నా రికార్డే కాదు.. 600 సాధిస్తాడు’

9 Oct, 2019 11:19 IST|Sakshi

వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌

ముంబై : టీమిండియా టెస్టు స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌పై కొందరు అవగాహనలేమితో విమర్శిస్తున్నారని వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ మండిపడ్డాడు. తాజాగా టెస్టుల్లో వేగంగా 350 వికెట్ల సాధించిన స్పిన్నర్‌గా ముత్తయ్య మురళీథరన్‌ సరసన అశ్విన్‌ చేరిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అతి తక్కువ టెస్టుల్లో ఈ ఘనత సాధించిన తొలి భారత్‌ బౌలర్‌గా మరో రికార్డును నెలకొల్పాడు. అయితే ఉపఖండపు పిచ్‌లపై మినహా విదేశాల్లో రాణించలేడని కొందరు పనికట్టుకొని విమర్శిస్తున్నారు. ఇంటా బయటా వికెట్లు సాధిస్తేనే రికార్డులకు, ఆటగాడికి గౌరవం అంటూ విమర్శకులు తమ నోటికి పనిచెప్పారు. అయితే ఈ విమర్శలపై హర్భజన్‌ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అశ్విన్‌కు మద్దతుగా నిలిచాడు. త్వరలోనే తన రికార్డు(417)ను అశ్విన్‌ బద్దలు కొడతాడని భజ్జీ జోస్యం చెప్పాడు. 

‘క్రికెట్‌పై సరైన అవగాహన లేని వారు అశ్విన్‌ను టార్గెట్‌ చేసి విమర్శిస్తున్నారు. కేవలం స్వదేశంలోనే రాణించగలడని అంటున్నారు. అయితే అవే పిచ్‌లపై ఇతర స్పిన్నర్లు ఎందుకు రాణించడం లేదు?. ప్రస్తుతం అశ్విన్‌తో పాటు మెరుగైన గణాంకాలు నమోదు చేసిన స్పిన్నర్‌ ఉన్నాడా?. అవన్నీ అవివేకంతో కూడుకున్న విమర్శలు. అశ్విన్‌ బౌలింగ్‌లో వైవిధ్యం ఉంటుంది. పరిస్థితి తగ్గట్టుగా బౌలింగ్‌ చేయగలడు. ఇక స్పిన్‌ ట్రాక్‌లపై అతడి బౌలింగ్‌ వేరియేషన్స్‌ అద్బుతంగా ఉంటాయి. కేవలం 66 టెస్టుల్లోనే 350 వికెట్లు​ పడగొట్టడం మామూలు విషయం కాదు. త్వరలోనే నా రికార్డును(417 వికెట్లు) అశ్విన్‌ అధిగమిస్తాడు. అంతేకాకుండా 600 వికెట్ల మైలురాయిని కూడా చేరుకుంటాడని భావిస్తున్నా’అంటూ భజ్జీ పేర్కొన్నాడు. 

ఇక టీమిండియా తరుపున వేగంగా 350 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్‌గా అనిల్‌ కుంబ్లే(77 టెస్టులు) రికార్డును తాజాగా అశ్విన్‌ బ్రేక్‌ చేసిన విషయం తెలిసిందే. ఇక 350 వికెట్ల సాధించిన నాలుగో బౌలర్‌గా.. మూడో స్పిన్నర్‌గా అశ్విన్‌ నిలిచాడు. ఇప్పటివరకు 66 టెస్టులాడిన ఈ ఆఫ్‌ స్పిన్నర్‌ 285 వికెట్లు(46 టెస్టులు) ఉపఖండపు పిచ్‌లపైనే సాధించాడు. విదేశీ పిచ్‌లపై 20 టెస్టుల్లో 65 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో స్వదేశీ పిచ్‌లపై మాత్రమే రాణించగలడని అశ్విన్‌ను విమర్శిస్తున్నారు. ఇక విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో​ అశ్విన్‌ అదరగొట్టిన విషయం తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు