‘పంత్‌కిది సువర్ణావకాశం.. ఏం చేస్తాడో చూడాలి’

23 Feb, 2019 09:16 IST|Sakshi

టీమిండియా వెటరన్‌ ఆటగాడు హర్భజన్‌ సింగ్‌

సాక్షి, న్యూఢిల్లీ : టీమిండియా సంచలన యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌పై సీనియర్‌ ఆటగాడు హర్భజన్‌ సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్‌లో పంత్‌ రాణిస్తే  ప్రపంచకప్‌లో పాల్గనబోయే టీమిండియాలో తప్పకుండా చోటు దొరుకుతుందని అభిప్రాయపడ్డాడు. శుక్రవారం ఓ ప్రముఖ జాతీయ మీడియాతో మాట్లాడిన భజ్జీ పలు విషయాలు చర్చించారు. ‘పంత్‌కు ఆస్ట్రేలియా సిరీస్‌ సువర్ణావకాశం. ఈ సిరీస్‌లో రాణిస్టే ప్రపంచకప్‌లో పంత్‌ను మనం తప్పకుండా చూడవచ్చు. ఒకేవేళ ఈ సిరీస్‌లో పంత్‌ దారుణంగా విఫలమైతే ప్రపంచకప్‌ దారులు మూసుకపోయే అవకాశం ఉంది. మరి పంత్‌ ఏం చేస్తాడో చూడాలి. ఇక ఇదే సిరీస్‌లో కేఎల్‌ రాహుల్‌ విపలమైతే ప్రపంచకప్‌లో పంత్‌ ఓపెనర్‌గా వచ్చినా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు. పంత్‌ ఓపెనర్‌గా తీసుకోవాలని అనుకుంటే దినేశ్‌ కార్తీక్‌కు కూడా జట్టులో అవకాశం ఉంటుంది’అంటూ భజ్జీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

రైనాకు కూడా అవకాశం ఉంది
‘ప్రస్తుతమున్న జట్టే సుమారుగా ప్రపంచకప్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఒకవేళ ఆటగాళ్లు గాయాలపాలైన, ఐపీఎల్‌లో అధ్భుతంగా రాణించిన ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తే తప్ప జట్టులో ఎలాంటి మార్పులు జరగవు. ఐపీఎల్‌లో అద్బుతంగా రాణిస్తే సురేశ్‌ రైనాతో పాటు, యువ ఆటగాళ్లు కూడా జట్టులో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎంఎస్‌ ధోని అనుభవం, అతడి ఆట టీమిండియాకు అదనపు బలం. ప్రస్తుత ఫామ్‌ ప్రకారం 4-1తేడాతో ఆసీస్‌పై టీమిండియా వన్డే సిరీస్‌ గెలిచే అవకాశాలు ఉన్నాయి. జస్ప్రిత్‌ బుమ్రా జట్టులోకి చేరడంతో బౌలింగ్‌ మరింత దుర్బేద్యంగా మారనుంది’అంటూ హర్భజన్‌ పేర్కొన్నాడు. ఇక ఈ పర్యటనలో ఆసీస్‌ టీమిండియాతో రెండు టీ20లు, ఐదు వన్డేలు ఆడనుంది. తొలి టీ20 విశాఖ వేదికగా రేపు(ఆదివారం) జరగనుంది.     

మరిన్ని వార్తలు