ఇది చాలా కష్టమబ్బా: హర్భజన్‌

9 Feb, 2019 15:41 IST|Sakshi

ముంబై : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వైఎస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మల్లో బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ ఎవరో చెప్పడం చాలా కష్టమని సీనియర్‌ క్రికెటర్‌, హర్భజన్‌ సింగ్ అభిప్రాయపడ్డాడు‌. శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో నెగ్గి కివీస్‌ గడ్డపై తొలి విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తాత్కలిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (29 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. తద్వారా అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 92 మ్యాచ్‌ల్లో 2,288 పరుగులు చేసిన రోహిత్‌... మార్టిన్‌ గప్టిల్‌ (న్యూజిలాండ్‌–2272)ను అధిగమించాడు.

ఈ నేపథ్యంలో కోహ్లి, రోహిత్‌ శర్మల్లో బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ ఎవరన్న మీడియా ప్రశ్నకు హర్భజన్‌ సింగ్‌ చాలా ఇబ్బంది పడ్డాడు. ‘ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. రోహిత్‌, కోహ్లిలు అద్భుత ఆటగాళ్లు.. అంతేకాకుండా ఇద్దరూ మ్యాచ్‌ విన్నర్సే‌. మంచి క్లాస్‌ ప్లేయర్స్‌ కూడా. వారేంటో వారి రికార్డులే చెబుతాయి. రోహిత్‌ మంచి నైపుణ్యం గల ఆటగాడైతే.. కోహ్లి నిరంతరం కష్టపడే క్రికెటర్‌. రోహిత్‌కు ఉన్నంత నైపుణ్యం.. కోహ్లికి ఉండకపోవచ్చు కానీ.. అతనికి ఆట పట్ల ఉన్న పిచ్చి, నిబద్దత, కష్టపడే తత్వమే కోహ్లిని ఈ స్థాయికి తీసుకొచ్చింది. అందుకే ఇద్దరిలో బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ ఎవరో చెప్పడం నాకు చాలా కష్టం. దీనికి నేను సమాధానం చెప్పలేను. కానీ ఇద్దరు భారత్‌కే ఆడుతున్నారనే విషయాన్ని గ్రహించాలి’ అని చెప్పుకొచ్చాడు. 

పొట్టి ఫార్మాట్‌లో నాలుగు సెంచరీలు బాదిన క్రికెటర్‌గా రోహిత్‌ చరిత్రకెక్కగా.. 19 టీ20 హాఫ్‌ సెంచరీలతో కోహ్లి అగ్రస్థానంలో ఉన్నాడు. దీనిపై కూడా హర్భజన్‌ స్పందిస్తూ... ‘ రోహిత్‌ ఓపెనర్‌గా రావడం వల్లే టీ20ల్లో సెంచరీలు చేయగలిగాడు. ఎందుకంటే అతనికి ఎక్కువ బంతులు ఆడే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు త్వరగా వికెట్లు కోల్పోతే కోహ్లి నెమ్మదిగా ఆడాల్సి వస్తుంది. పరిస్థితులకు తగ్గట్లు బాధ్యాతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ నిర్మించాల్సి ఉంటుంది. అప్పటికే 15-16 ఓవర్లు పూర్తవుతాయి. కాబట్టి ఆటగాళ్ల వ్యక్తిగత లెక్కలు పట్టించుకోకుండా.. ఈ ఇద్దరు ఆటగాళ్లు దేశం గెలుపు కోసం ఎంచేస్తున్నారనే విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి.’ అని హర్భజన్‌ సూచించారు.
 

మరిన్ని వార్తలు