కోహ్లి ఒక్కడి వల్ల కాదు: భజ్జీ

12 Aug, 2018 15:15 IST|Sakshi
విరాట్‌ కోహ్లి

ముంబై : లార్డ్స్‌ టెస్ట్‌లో పీకల్లోతు కష్టాల్లో పడ్డ టీమిండియాను కాపడటం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఒక్కడి వల్ల కాదని సీనియర్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. ఓ స్పోర్ట్స్‌ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. కోహ్లికి మద్దతుగా ఇద్దరు లేదా ముగ్గురు బ్యాట్స్‌మన్‌ క్రీజులో పాతుకుపోవాలని, అలాగైతేనే భారత్‌ ఓటమి నుంచి గట్టెక్కుతుందన్నాడు. మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట చాల ముఖ్యమైనదని చెప్పుకొచ్చాడు. మూడో రోజు ఆటలో ఇంగ్లండ్‌ అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను తనవైపు లాగేసుకుందని తెలిపాడు. వాతావరణం భారత్‌కు అనుకూలించడం లేదనీ, ఇంగ్లీష్‌ బౌలర్లు 10 నుంచి 30 ఓవర్లు బౌలింగ్‌ చేసినా టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడతారన్నాడు. ఇది ఇంగ్లండ్‌కు బంగారం లాంటి అవకాశమన్నాడు. ఈ మ్యాచ్‌ కోహ్లిసేన డ్రా చేసుకుంటే.. మూడో టెస్టుకు ఆటగాళ్లలో విశ్వాసం పెరుగుతోందని అభిప్రాయపడ్డాడు.

తొలుత ప్రతాపం చూపిన భారత పేసర్లు... కీలక దశలో తేలిపోయిన విషయం తెలిసిందే. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌ (159 బంతుల్లో 120 బ్యాటింగ్‌; 18 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగగా.. అతడికి అండగా నిలుస్తూ వికెట్‌ కీపర్‌ బెయిర్‌స్టో (144 బంతుల్లో 93; 12 ఫోర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మూడో రోజు శనివారం ఆట నిలిపి వేసే సమయానికి ఇంగ్లండ్‌ 6 వికెట్లకు 357 పరుగులతో పటిష్టస్థితిలో నిలిచింది. వోక్స్‌తో పాటు స్యామ్‌ కరన్‌ (24 బంతుల్లో 22 బ్యాటింగ్‌; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. నాలుగు వికెట్లు చేతిలో ఉన్న ఇంగ్లండ్‌ 250 పరుగుల ఆధిక్యంలో ఉంది.

చదవండి: ఆ నిర్ణయమే కోహ్లిసేన కొంపముంచిందా?

>
మరిన్ని వార్తలు