సెలక్టర్లపై మండిపడ్డ హర్భజన్‌ సింగ్‌

24 Dec, 2019 19:38 IST|Sakshi

ముంబై: టీమిండియా సెలక్టర్ల తీరును క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ తప్పుబట్టాడు. సెలక్షన్‌ కమిటీ వేర్వేరు ఆటగాళ్లకు వేర్వేరు నిబంధనలు కలిగి ఉంటుందని విమర్శించాడు. వచ్చే నెలలో భారత ‘ఏ’ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. అదే విధంగా కోహ్లి సేన శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా, భారత ఏ జట్లను చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని కమిటీ సోమవారం ప్రకటించింది. కాగా కొన్ని రోజులుగా నిలకడగా రాణిస్తున్న ముంబై క్రికెటర్‌ సూర్య కుమార్‌ యాదవ్‌.. భారత ‘ఏ’ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కానీ శ్రీలంక, ఆసీస్‌లతో తలపడనున్న టీమిండియా జట్టులో మాత్రం అతడు స్థానం సంపాదించలేకపోయాడు.

ఈ విషయంపై స్పందించిన భజ్జీ.. టీమిండియా సెలక్టర్ల తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘ అసలు సూర్యకుమార్‌ యాదవ్‌ ఏం తప్పు చేశాడు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. టీమిండియా ఏ, ఇండియా బీ జట్లకు ఎంపికైన ఇతర ఆటగాళ్లతో పోలిస్తే అతడు ఎక్కువగానే పరుగులు చేశాడు. కానీ వేర్వేరు ఆటగాళ్లకు వేర్వేరు నిబంధనలు ఎందుకు’ ట్విటర్‌ వేదికగా ప్రశ్నించాడు. కాగా గతంలో సంజూ శాంసన్ విషయంలోనూ భజ్జీ ఇదే తీరుగా స్పందించిన విషయం తెలిసిందే. ఇక న్యూజిలాండ్‌ టూర్‌లో భాగంగా ‘ఎ’  జట్టు 3 వన్డేలు, 2 నాలుగు రోజుల మ్యాచ్‌లు (అనధికారిక టెస్టులు) ఆడుతుంది. జనవరి 19, 22, 24 తేదీల్లో వన్డేలు... జనవరి 30 నుంచి ఫిబ్రవరి 10 మధ్య రెండు అనధికారిక టెస్టులు జరుగనున్నాయి.

మరిన్ని వార్తలు