ఐపీఎల్‌లో రాణించినా నిరాశే

19 Jul, 2013 05:06 IST|Sakshi
ఐపీఎల్‌లో రాణించినా నిరాశే

చండీగఢ్: భారత జట్టు సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్‌కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. ఫామ్‌లో లేక జాతీయ జట్టులో చోటు కోల్పోయిన భజ్జీ ఐపీఎల్-6లో మెరుగ్గానే రాణించాడు. అయినా ఇటీవలి చాంపియన్స్ ట్రోఫీ, విండీస్ పర్యటనతో పాటు జింబాబ్వేతో జరగాల్సిన వన్డే సిరీస్‌కు కూడా ఎంపిక కాలేకపోయాడు.
 
 ఫామ్ నిరూపించుకున్నా జట్టులో చోటు దొరక్కపోవడంపై ఈ పంజాబీ స్పిన్నర్ ఆశ్చర్యం వ్యక్త చేశాడు. ‘భారత జట్టులో చోటు దక్కించుకునేందుకు ఐపీఎల్ మంచి వేదికలా ఉపయోగపడుతుందంటారు. నేనా టోర్నీలో విశేషంగా రాణించి 24 వికెట్లు తీశాను. అలాగే ముంబై ఇండియన్స్ ట్రోఫీ కూడా గెలుచుకుంది. నా విషయంలో సెలక్టర్లే నిర్ణయం తీసుకోవాలి.
 
 మరో ఐదేళ్ల పాటు నేను క్రికెట్ ఆడగలను’ అని హర్భజన్ అన్నాడు. ప్రతీ ఒక్కరికీ ఎత్తుపల్లాలు ఉంటాయని, ఎలాంటి గాయాలు లేకుండా జట్టుకు ఆడి విజయాలు అందించానని గుర్తుచేశాడు. అలాగే కెరీర్‌లో రెండు, మూడు మ్యాచ్‌లు ఆడిన వారు వంద మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లను విమర్శించడం మానుకోవాలని తన విమర్శకులకు హితవు చెప్పాడు. జింబాబ్వే పర్యటనకు ఎంపిక కాకపోవడం తన కెరీర్‌కు ముగింపేమీ కాదని అన్నాడు. పునరాగమనం కోసం దేశవాళీ క్రికెట్ ఆడతానని చెప్పాడు. ప్రస్తుత జట్టు అన్ని రంగాల్లో ఆకట్టుకుంటుందని హర్భజన్ ప్రశంసించాడు.
 

మరిన్ని వార్తలు