హార్దిక్ మెరుపులు

18 Jun, 2017 21:20 IST|Sakshi
హార్దిక్ మెరుపులు

లండన్: చాంపియన్స్ ట్రోఫీలో దాయాది పాకిస్తాన్ తో జరుగుతున్న తుది పోరులో భారత్ జట్టు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో మిడిల్ ఆర్డర్ ఆటగాడు హార్దిక్ పాండ్యా బ్యాట్ ఝుళిపించాడు. వరుస సిక్సర్లతో దూకుడును పెంచిన పాండ్యా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. టాపార్డర్ అంతా విఫలమైన తరుణంలో 32 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో అర్థ శతకం సాధించాడు. 23 ఓవర్ లో హ్యాట్రిక్ సిక్సర్ల సాధించడంతో భారత్ స్కోరు బోర్డులో వేగం పెరిగింది. అయితే హార్దిక్ మంచి దూకుడుగా ఉన్న తరుణంలో రవీంద్ర జడేజా చేసిన తప్పిదం వల్ల రనౌట్ అవుటయ్యాడు. హార్దిక్ 43 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 76 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

అంతకుముందు పాకిస్తాన్ 339 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.  పాకిస్తాన్ ఓపెనర్లు ఫకార్ జమాన్(114;106బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు), అజహర్ అలీ(59;71బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్)లతో పాటు బాబర్ అజమ్(46;52 బంతుల్లో 4 ఫోర్లు), మొహ్మద్ హఫీజ్(57 నాటౌట్;37 బంతుల్లో 4 ఫోర్లు ,3 సిక్సర్లు) లు మెరిసి జట్టు భారీ స్కోరుకు తోడ్పడ్డారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ కు ఓపెనర్లు జమాన్, అజహర్ అలీలు శుభారంభం అందించారు.  ఈ జోడి తొలి వికెట్ కు 128 పరుగులు చేసి జట్టును పటిష్ట స్థితికి చేర్చింది. ఈ క్రమంలోనే ముందు అజహర్ అలీ హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై జమాన్ అర్థ శతకం నమోదు చేశాడు. అయితే ఆపై వీరిద్దరూ మరింత దూకుడుగా ఆడే క్రమంలో అలీ తొలి వికెట్ గా వెనుదిరిగాడు. ఆపై జమాన్ కు జత కలిసిన ఫస్ట్ డౌన్ ఆటగాడు బాబర్ అజమ్ సమయోచితంగా ఆడాడు. ఈ క్రమంలోనే బాబర్-జమాన్ లు జోడి72 పరుగులు జత చేసింది. దాంతో పాకిస్తాన్ 33.1 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది.


అటు తరువాత పాకిస్తాన్ వెటరన్ ఆటగాడు షోయబ్ మాలిక్(12)నిరాశపరిచినప్పటికీ, బాబర్ అజమ్ మాత్రం నిలకడగా ఆడాడు. అయితే హాఫ్ సెంచరీకి కొ్ద్ది దూరంలో నాల్గో వికెట్ గా అజమ్ అవుటయ్యాడు. కాగా, ఆపై మొహ్మద్ హఫీజ్ సైతం చెలరేగి ఆడటంతో పాకిస్తాన్ జట్టు మూడొందల మార్కును అవలీలగా దాటింది. ఇమాద్ వసీం(25 నాటౌట్; 21 బంతుల్లో 1 ఫోర్, 1సిక్సర్) తో కలిసి  71 పరుగులు జత చేయడంతో పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది.