అమ్మ బాధపడింది.. ఇకపై అలాంటివి అడగను : కరణ్‌ జోహర్‌

25 Jan, 2019 09:51 IST|Sakshi

దావోస్‌ : ‘కాఫీ విత్‌ కరణ్‌’ టీవీ షోలో మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి నిషేదాన్ని ఎదుర్కొంటున్నయువ క్రికెటర్లు హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌పై విధించిన నిరవధిక నిషేధాన్ని క్రికెట్‌ పరిపాలక కమిటీ (సీవోఏ) గురువారం ఎత్తివేసింది. నిషేధం తొలగించడంతో హార్దిక్‌ పాండ్యా న్యూజిలాండ్‌ వెళ్లి జట్టుతో కలుస్తాడని... రాహుల్‌ భారత ‘ఎ’జట్టు తరఫున బరిలోకి దిగుతాడని బీసీసీఐ ప్రకటించింది. దీనిపై ‘కాఫీ విత్‌ కరణ్‌’ షో హోస్ట్‌, బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్‌ జోహార్ స్పందించారు. పాండ్యా, రాహుల్‌పై బీసీసీఐ నిషేదం ఎత్తివేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. దావోస్‌లో జరగుతున్న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన కరణ్‌ గురువారం ఇండియా టుడేకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

పెద్ద మనసుతో క్షమించారు..
పాండ్యా, రాహుల్‌పై బీసీసీఐ నిషేదం విధించంతో చాలా కుంగిపోయానని కరణ్‌ చెప్పుకొచ్చారు. ‘నా పిచ్చి ప్రశ్నల వల్లే మీరు ఈ వివాదంలో చిక్కుకున్నారు. నన్ను క్షమించండి’ అని పాండ్యా, రాహుల్‌లను కోరానని తెలిపారు. పెద్ద మనసుతో వారిద్దరూ తనను క్షమించారని కరణ్‌ వెల్లడించారు. ‘అది మీ తప్పిదం కాదు’ అని వారి నుంచి రిప్లై వచ్చినట్టు తెలిపారు. తన తల్లి పాండ్యా అభిమాని అని, ఈ వివాదంతో ఆమె మనస్తాపం చెందాని కరణ్‌ విచారం వ్యక్తం చేశారు. ఈ షోలో అమ్మాయిల గురించి ప్రశ్నలు అడగడం కొత్తేమీ కాదని అన్నారు. అయితే, పాండ్యా, రాహుల్‌ల విషయంలో అది కాస్త లయ తప్పిందని అభిప్రాయపడ్డారు.

షోలో పాండ్యా, రాహుల్‌ కామెంట్లను ఎడిట్‌ చేయొచ్చు కదా అని చాలామంది అన్నారని, కానీ నేనది గ్రహించలేకపోయానని కరణ్‌ వాపోయారు. తనకు క్రికెటర్లంటే చాలా ఇష్టమని చెప్పారు. కానీ ఇంత వ్యవహారం జరిగిన తర్వాత ‘కాఫీ విత్‌ కరణ్‌’కు మళ్లీ వారు వస్తారో రారో అని అనుమానం వ్యక్తం చేశారు. ‘క్రికెట్‌పై నాకు పెద్దగా అవగాహన లేదు. క్రికెటర్లు నాకు మరో ఛాన్స్‌ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇకపై మహిళలను తక్కువగా చూపే ప్రశ్నలు అడగను. క్రికెట్‌పై అవగాహన పెంచుకుని.. పూర్తిగా ఆటకు సంబంధించిన ప్రశ్నలే అడుగుతాను’ అన్నారు.

మరిన్ని వార్తలు