పాండ్యా, రాహుల్‌లపై వేటు

11 Jan, 2019 17:06 IST|Sakshi

సిడ్నీ : ఎంత ఎదిగినా ఒదిగి లేకపోతే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందనేది భారత క్రికెటర్లు హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌ల విషయంలో రుజువైంది. అంతర్జాతీయ క్రికెటర్లమనే సోయి మరిచిన ఈ యువ ఆటగాళ్లు ఓ టీవీ షోలో మహిళల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలతో సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్నారు. విమర్శలే కాదు.. కెప్టెన్‌ కోహ్లి, బీసీసీఐ అధికారుల ఆగ్రహానికి కూడా గురయ్యారు. అంతేకాకుండా ఇప్పుడు జట్టులో చోటు కూడా కోల్పోయారు.

ఈ అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఈ యువ ఆటగాళ్లపై బీసీసీఐ సస్పెన్షన్‌ వేటు వేసింది. దీంతో రేపు (శనివారం) ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు దూరం అయ్యారు. సస్పెన్షన్‌కు గురైన రాహుల్‌, పాండ్యాలు తిరిగి భారత్‌కు బయలుదేరనున్నారని తెలుస్తోంది. మళ్లీ కొత్తగా షోకాజ్‌ నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం. దర్యాప్తును చేపట్టేది బీసీసీఐ అంతర్గత కమిటీనా లేక తాత్కాలిక అంబుడ్స్‌మనా అనేది ఇంకా నిర్ణయించలేదు. ఆ ఇద్దరు ఆటగాళ్లను జట్టుతో పాటే ఆస్ట్రేలియాలోనే ఉంచాలని అనుకున్నా బీసీసీఐలోని చాలామంది అధికారులు ఈ ఆలోచనను వ్యతిరేకించారని ఓ అధికారి వెల్లడించారు. సస్పెండైన ఆటగాళ్ల స్థానంలో రిషభ్‌ పంత్‌, మనీశ్‌ పాండే ఆస్ట్రేలియా వెళ్లే అవకాశాలు ఉన్నాయని అన్నారు. విజయ్‌ శంకర్‌, శ్రేయస్‌ అయ్యర్‌ వెళ్లినా ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు.

ఇక ఆసియాకప్‌లో గాయపడిన పాండ్యా.. వెస్టిండీస్‌, ఆస్ట్రేలియాలతో సిరీస్‌లకు దూరమైన విషయం తెలిసిందే. ఆసీస్‌తో మూడో టెస్ట్‌కే సెలక్టర్ల నుంచి పిలుపునందుకున్నప్పటికీ తుది జట్టులో అవకాశం లభించలేదు. ఈ నేపథ్యంలో శనివారం ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌తోనైనా తన పునరాగమనాన్ని ఘనంగా చాటాలని భావించిన పాండ్యాకు నిరాశ ఎదురైంది. ఇక గత కొన్నిరోజులుగా నిలకడలేమి ఆటతో సతమతమవుతున్న కేఎల్‌ రాహుల్‌పై అభిమానులు మామాలుగానే ఆగ్రహంగా ఉన్నారు. దీనికి ఈ అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు వారి ఆగ్రహానికి మరింత ఆజ్యం పోసింది.

బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘కాఫీ విత్‌ కరణ్‌’ టీవీ షోలో పాండ్యా, రాహుల్‌ ఇద్దరు అశ్లీల రీతిలో మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ఇది ఇటీవలే ప్రసారమైంది. అందులో 25 ఏళ్ల ఆల్‌రౌండర్‌ పాండ్యా మాట్లాడుతూ ‘అమ్మాయిల విషయంలో నేనేమీ బుద్ధిమంతుడ్ని కాదు. వాళ్లను అదోటైపుగా చూస్తా. క్లబ్‌లలో వారి ఒంపుసొంపులపై కైపుగా కన్నేస్తా. ఎవరైనా అమ్మాయిని శారీరకంగా కలిస్తే ‘ఆజ్‌ మై కర్‌ కే ఆయా’ (నేను ఈ రోజు ...ఆ పని చేసొచ్చా) అని తల్లిదండ్రులతో చెప్పేస్తా’ అని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై పశ్చాతాపం వ్యక్తం చేస్తూ పాండ్యా సోషల్‌ మీడియా వేదికగా క్షమాపణలు కోరినప్పటికి బీసీసీఐ సంతృప్తి చెందలేదు.

మరిన్ని వార్తలు