ప్రేయసితో హార్దిక్‌ పాండ్యా ఎంగేజ్‌మెంట్‌

1 Jan, 2020 19:02 IST|Sakshi

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తన ప్రియురాలు, సెర్బియా మోడల్‌ నటాషాతో పెళ్లికి సిద్ధమయ్యాడు. నూతన సంవత్సరం తొలిరోజే తన ప్రేయసి వేలికి ఉంగరం తొడిగి నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌తో ఫొటోలకు ఫోజులిస్తున్న నటాషాను హత్తుకున్న ఫొటోను షేర్‌ చేసిన హార్దిక్‌... ‘ నేను నీ వాడిని. నువ్వు నా దానివి ప్రియా’ అంటూ పాట రూపంలో తమ ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. ఇక నటాషా సైతం హార్దిక్‌ తనకు రింగ్‌తో ప్రపోజ్‌ చేస్తున్న వీడియోను పోస్ట్‌ చేసి.. ‘ ఎల్లప్పుడూ అవుననే చెబుతాను’ అంటూ క్యాప్షన్‌ జతచేశారు. దీని ప్రకారం ఈ ప్రేమ జంట సముద్రంలో నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది.

​ఈ నేపథ్యంలో హార్దిక్‌- నటాషా జంటకు లక్షల్లో లైకులు వచ్చిపడుతున్నాయి. క్షణాల్లోనే హార్దిక్‌ పాండ్యా పోస్టు వైరల్‌గా మారింది. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సహా పలువురు టీమిండియా క్రికెటర్లు హార్దిక్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  కాగా గతంలో చాలామంది అమ్మాయిలతో హార్దిక్‌ డేటింగ్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే నటాషాతో మాత్రం పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడని.. తనతో వివాహ బంధానికి సిద్ధమయ్యాడంటూ అతడి సన్నిహితులు చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం హార్దిక్‌.. ఎంగేజ్‌మెంట్‌తో నూతన సంవత్సరాన్ని ప్రారంభించి మధురానుభూతులను సొంతం చేసుకున్నాడు.

ఇక నటాషా విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె ముంబైలో నివాసముంటున్నారు. ఐటం గర్ల్‌గా తొలుత బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన నటాషా.. షారుక్‌ ఖాన్‌, అనుష్క నటించిన ‘జీరో’  సినిమాలో ఓ పాత్ర కూడా పోషించారు. అదే విధంగా... హిందీలో ప్రసారమవుతున్న డ్యాన్స్‌ రియాలిటీ టీవీ షో ‘నచ్‌ బలియే’లోనూ పోటీపడ్డారు. ఆ సమయంలో నటాషాకు ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా హార్దిక్‌ గతంలో విజ్ఞప్తి చేసిన విషయం అతడి అభిమానులకు గుర్తుండే ఉంటుంది. ఇక నటాషాను హార్దిక్‌ గతంలోనే తన కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడని.. వీరి ప్రేమకు వారు అంగీకారం తెలిపారంటూ వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. కాగా గాయంతో జట్టుకు దూరమైన పాండ్యా ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు