కుమిలిపోతున్న పాండ్యా!

16 Jan, 2019 18:00 IST|Sakshi

ఇంటి నుంచి బయటకు రాని వైనం

అహ్మదాబాద్‌ : మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలతో టీమిండియా యువ క్రికెటర్లు హర్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌లు సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరమైన అర్ధాంతరంగా భారత్‌కు తిరగొచ్చారు. ఇంటికి చేరుకున్న పాండ్యా గదిలో నుంచి బయకు రావడం లేదని అతని తండ్రి హిమాన్షు మీడియాకు తెలిపారు. తన వ్యాఖ్యలు, బీసీసీఐ సస్పెన్షన్‌ పట్ల పాండ్యా కుంగిపోతున్నాడని, ఎవరు ఫోన్ చేసినా స్పందించడం లేదన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా చాలా బాధగా ఉన్నాడని, తనకు ఎంతో ఇష్టమైన పతంగులను ఎగరవేయలేదని చెప్పుకొచ్చాడు. తనకు కైట్స్‌ అంటే చాలా ఇష్టమని, కానీ క్రికెట్‌ కోసం కొన్నేళ్లుగా ఇంటికి దూరంగా ఉండటంతో పంతంగులు ఎగురవేయలేదన్నారు. కానీ ఇప్పుడు ఇంట్లోనే ఉండి కూడా కైట్స్‌ ఎగురేయడానికి ఇష్టపడటం లేదని తెలిపారు. కరణ్‌ షోలో చేసిన తన వ్యాఖ్యల పట్ల పాండ్యా తీవ్రంగా కుమిలిపోతున్నాడని, బీసీసీఐ సస్పెన్షన్‌తో తీవ్రంగా బాధపడుతున్నాడని చెప్పారు. తాము కూడా ఈ విషయం గురించి అతనితో మాట్లాడదలుచుకోలేదని, బీసీసీఐ తీసుకోబోయే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామన్నారు.

విచారణ ప్రారంభం..
రెండో సారి షోకాజ్‌ నోటీసులందుకున్న పాండ్యా, రాహుల్‌లు బేషరతుగా క్షమాపణలు తెలిపారు. టెలిఫోన్‌ ద్వారా ఈ యువ ఆటగాళ్లు బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రీతో మాట్లాడారు. విచారణ మాత్రమే ప్రారంభమైందని జోహ్రీ వారితో చెప్పారు. వారి నుంచి వివరణ తీసుకున్న జోహ్రీ.. ఈ నివేదికను క్రికెట్‌పాలకుల కమిటీ (సీఈవో)కు అందజేయనున్నారు. అంబుడ్స్‌ నియామకంతో తర్వాతి దశ విచారణ ప్రారంభం కానుందని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు. ఇక యువ క్రికెటర్ల కెరీర్‌ ముగిసేలా చర్యలు ఉండొద్దని సీఓఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ సూచిస్తుండగా.. మరో సభ్యురాలు డయానా ఎడుల్జీ మాత్రం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించాలని డిమాండ్‌ చేస్తోంది.

మరిన్ని వార్తలు