వాచ్‌: హెలికాప్టర్‌ షాట్‌తో అదరగొట్టిన పాండ్యా..!

19 Apr, 2019 11:34 IST|Sakshi

న్యూఢిల్లీ : హెలికాప్టర్‌ షాట్‌.. అనగానే ఠక్కున గుర్తొచ్చే మహేంద్రసింగ్‌ ధోనీ. తనదైన స్టైల్‌లో ధోని హెలికాప్టర్‌ షాట్‌ ఆడితే.. అభిమానులకు కన్నులపండుగగా ఉండేది. ఇప్పుడు ఆ షాట్‌ ఆడటంలో అచ్చం ధోనీని తలపిస్తున్నాడు హార్దిక్‌ పాండ్యా. తాజాగా ఢిల్లీ క్యాపిటల్‌తో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో హెలికాప్టర్‌ షాట్‌తో పాండ్యా సిక్సర్‌గా మలిచాడు. రబడా వేసిన చివరి ఓవర్‌లో మణికట్టు మాయాజాలంతో బంతిని అమాంతం గాల్లోకి లేపి సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత బంతికే పాండ్యా ఔటయ్యాడు. అయితే, హార్దిక్‌ ఆడిన హెలికాప్టర్‌ షాట్‌పై సోషల్‌ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ షాట్‌ ఆడగానే.. జట్టులోని తోటి సభ్యుడైన కీరన్‌ పోలార్డ్‌ కూడా చప్పట్లతో స్వాగతించాడు. 

ఈ మ్యాచ్‌లో పాండ్యా సోదరుల జోడీ అద్భుతంగా ఆడటంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ 168 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ తడబడటంతో ఈ మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో ముంబై విజయ ఢంకా మోగించింది. ముంబై నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులకే పరిమితమైంది. ముంబై యువ స్పిన్నర్‌ రాహుల్‌ చహర్‌(3/19), బుమ్రా(2/18) ధాటికి ఢిల్లీ విలవిల్లాడింది. ముంబై బౌలర్ల కట్టదిట్టంగా బౌలింగ్‌ చేయడంతోపాటు వరుసగా వికెట్ల తీయడంతో ఢిల్లీ కుదేలైంది

అంతకుముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ తీసుకున్న ముంబై ఇన్నింగ్స్‌ను రోహిత్‌ శర్మ-డీకాక్‌లు ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 57 పరుగులు జత చేసిన తర్వాత రోహిత్‌ శర్మ(30) ఔటయ్యాడు. ఆపై బెన్‌ కట్టింగ్‌(2) నిరాశపరచగా, కాసేపటికి డీకాక్‌(35) రనౌట్‌ అయ్యాడు. దాంతో ముంబై 74 పరుగుల వద్ద మూడో వికెట్‌ను నష్టపోయింది. ఇక సూర్యకుమార్‌ యాదవ్‌(26) ఫర్వాలేదనిపించగా, కృనాల్‌ పాండ్యా-హార్దిక్‌ పాండ్యాలు ఇన్నింగ్స్‌ ను చక్కదిద్దారు. ఇక్కడ హార్దిక్‌ 15 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 32 పరుగులు చేయగా, కృనాల్‌ 26 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో అజేయంగా 37 పరుగులు చేశాడు. దాంతో ముంబై ఇండియన్స్‌ నిర్ణీత ఓవర్లో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. చివరి మూడు ఓవర్లలో ముంబై ఇండియన్స్‌ 50 పరుగులు సాధించింది. ఢిల్లీ బౌలర్లలో రబడా రెండు వికెట్లు సాధించగా, అమిత్‌ మిశ్రా, అక్షర్‌ పటేల్‌లు తలో వికెట్‌ తీశారు.

మరిన్ని వార్తలు