భారత్‌-పాక్‌ మ్యాచ్‌: పాండ్యాకు గాయం

19 Sep, 2018 18:42 IST|Sakshi

దుబాయ్‌: ఆసియాకప్‌లో భాగంగా దాయాదీ పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మ్యాచ్‌ మధ్యలో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గాయపడ్డాడు. 18వ ఓవర్‌ వేసిన పాండ్యా ఐదో బంతి వేస్తుండగా.. వెన్ను పట్టేసింది. దీంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే భారత ఫిజియోలు మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చారు. నొప్పితో విలవిలలాడుతున్న పాండ్యాను స్ట్రెచర్‌ సాయంతో మైదానం బయటకు తీసుకెళ్లారు. దీంతో ఈ ఓవర్‌ చివరి బంతిని రాయుడు వేసాడు. పాండ్యా గాయం భారత్‌కు ప్రతి కూలం కానుంది.  అతని గాయం.. భారత బౌలింగ్‌, బ్యాటింగ్‌ల విభాగాలపై దెబ్బపడనుంది.

ఇక అంతక ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ను భువనేశ్వర్‌ కుమార్‌ ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్లిద్దరిని ఇమామ్‌ ఉల్‌ హక్‌(2), ఫఖర్‌ జమాన్‌(0)లను పెవిలియన్‌ చేర్చాడు. దీంతో పాక్‌ మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన షోయబ్‌ మాలిక్‌, బాబర్‌ ఆజమ్‌లు ఆచితూచి ఆడుతూ పాక్‌ ఇన్నింగ్స్‌ను గట్టెక్కించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించిన అనంతరం బాబర్‌ అజమ్‌(47)ను కుల్దీప్‌ ఔట్‌ చేశాడు.  ప్రస్తుతం పాకిస్తాన్‌ 21.3 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసిది. క్రీజులో మాలిక్‌(35), సర్ఫరాజ్‌ అహ్మద్‌(0)లు ఉన్నారు. 

మరిన్ని వార్తలు