ఆ బంతి ఆణిముత్యమే 

21 Aug, 2018 00:56 IST|Sakshi

సునీల్‌ గావస్కర్‌ 

రెండో టెస్టు ఓటమి అనంతరం టీమిండియా తనదైన శైలిలో పుంజుకొంది. మూడో టెస్టుపై అన్ని విధాలా పట్టు సాధించి సాధ్యమైనంత త్వరగా విజయం సాధించేలా ఉంది. టాస్‌ గెలిచి మరీ బ్యాటింగ్‌ ఇచ్చిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ ఉదారతకు భారత్‌ ధన్యవాదాలు తెలపాలి. గత మ్యాచ్‌ల్లో స్వింగ్‌ బంతులను ఆడలేక విరాట్‌ కోహ్లి మినహా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేసినందున ఓ విధంగా అతడి నిర్ణయం సరైనదే అనుకోవాలి.  యోయో పరీక్షలో మాదిరిగా బంతి వంపులు తిరిగిన బర్మింగ్‌హామ్, లార్డ్స్‌ టెస్టుల్లో భారత జట్టు విఫలమైంది. ఆ బంతులు ఆఫ్‌స్టంప్‌ చుట్టూనే తిరుగాడాయి. ట్రెంట్‌బ్రిడ్జ్‌ టెస్టులో మాత్రం టీమిండియా భిన్న దృక్పథంతో బరిలో దిగింది. ప్యాడ్‌ల మీదుగా బ్యాట్స్‌మెన్‌ ఆడిన షాట్లే దీనికి నిదర్శనం. బంతి స్వింగ్‌ అవుతున్న పరిస్థితుల్లో ఓపెనర్లు రెండు ఇన్నింగ్స్‌లోనూ అర్ధశతక భాగస్వామ్యాలు నెలకొల్పారు. రెండో ఇన్నింగ్స్‌లో బాగా ఆడుతున్న సమయంలో ధావన్, రాహుల్‌ అవుటయ్యారు. వారి ప్రయత్నం తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి, రహానేలకు. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి, పుజారాలకు పనిని సులువు చేసిది. విఫలమైతే స్థానం కోల్పోయే పరిస్థితుల్లో... పుజారా తన కెరీర్‌ను కాపాడుకున్నాడు. 

రెండో రోజు లంచ్‌ తర్వాత చెలరేగిన భారత బౌలర్లు ఇంగ్లండ్‌ను వణికించారు. ఆఫ్‌ స్టంప్‌ చుట్టూ చక్కటి లైన్‌లో బౌలింగ్‌ చేసిన హార్దిక్‌ పాండ్యా తొలిసారి ఐదు వికెట్లు పడగొట్టాడు. బ్యాట్‌ అంచులను తాకేలా అతడు బంతులేశాడు. ఫామ్‌లో ఉన్న బెయిర్‌స్టోను అవుట్‌ చేసిన బంతి నిజంగా ఆణిముత్యమే. పాండ్యా చాలా తక్కువ దూరం నుంచి బౌలింగ్‌ చేశాడు. అంతేకాక... మన బౌలర్లందరూ ఇంగ్లండ్‌ బౌలర్లను మించిన వేగం కనబర్చారు. భారత్‌ ఈ మ్యాచ్‌లో గెలిచి.. సిరీస్‌ కైవసం చేసుకునే దిశగా వేటను కొనసాగించాలి.   

మరిన్ని వార్తలు