టీమిండియాకు ఎదురుదెబ్బ

21 Feb, 2019 15:47 IST|Sakshi

ముంబై: ఆస్ట్రేలియాతో స్వదేశంలో ఆడబోయే ద్వైపాక్షిక పరిమిత ఓవర్ల సిరీస్‌కు ముందే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్‌తో సిరీస్‌కు ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా దూరమయ్యాడు. హార్దిక్‌కు వెన‍్నునొప్పి బాధ తిరగబెట్టడంతో సిరీస్‌ మొత్తానికి దూరమవుతున్నట్లు బీసీసీఐ తాజాగా ప్రకటించింది. గత సెప్టెంబర్‌లో ఆసియాకప్‌లో పాకిస్తాన్‌ మ్యాచ్‌ తర్వాత వెన్నునొప్పి కారణంగా ఆ టోర్నీకి మొత్తం దూరమైన హార్దిక్‌కు మరోమారు గాయం తిరగబెట్టడంతో ఆసీస్‌తో సిరీస్‌ నుంచి అర్ధాంతరంగా వైదొలగాల్సి వచ్చింది. దాంతో భారత్‌కు గట్టి షాక్‌ తగిలినట్లు అయ్యింది.

ఆసీస్‌తో సిరీస్‌కు పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగాలనుకున్నప్పటికీ రెగ్యులర్‌ ఆల్‌ రౌండర్‌గా సేవలందిస్తున్న పాండ్యా దూరం కావడం భారత్‌ను కలవర పరుస్తోంది. ప్రధానంగా వరల్డ్‌కప్‌కు ముందు జరుగుతున్న ఒక కీలక సిరీస్‌ నుంచి పాండ్యా వైదొలగడం టీమిండియా మేనేజ్‌మెంట్‌ను ఆలోచనలో పడేసింది. కాగా, పాండ్యా స్థానంలో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎవర్నీ ప్రకటించని సెలక్టర్లు.. వన్డే సిరీస్‌కు మాత్రం రవీంద్ర జడేజాను ఎంపిక చేశారు.  భారత్‌-ఆసీస్‌ జట్ల మధ్య సిరీస్‌  ఆదివారం నుంచి ఆరంభం కానుంది. తొలుత టీ20 సిరీస్‌ జరుగనుండగా, ఆపై ఐదు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి.

మరిన్ని వార్తలు