కరణ్‌ షోతో పాండ్యా చాలా డిస్టర్బ్ అయ్యాడు 

5 Feb, 2019 20:55 IST|Sakshi

సాక్షి, ముంబై: ‘కాఫీ విత్‌ కరణ్‌ షో’లో తాను మాట్లాడిన మాటలు వివాదానికి దారితీయడంతో హార్దిక్‌ పాండ్యా చాలా డిస్టర్బ్‌ అయ్యాడని అతడి మెంటర్‌, మాజీ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ కిరణ్‌ మోరే తెలిపారు. ఆ షోలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాడని వివరించాడు. ప్రస్తుతం పాండ్యా టీమిండియా కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాడని మోరే తెలిపాడు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్‌ మోరే మాట్లాడుతూ..  ‘ఆ షోలో పాండ్యా కంట్రోల్‌ తప్పి ఏదేదో మాట్లాడాడు. కానీ పాండ్యా స్వభావం, వ్యక్తిత్వం అటువంటిది కాదు. పొరపాట్లనేవి ప్రతీ ఒక్కరి జీవితంలో సహజం. దీనిపై ఇప్పటికే బీసీసీఐకి, మహిళలకు క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం అన్ని వివాదాలు తొలిగిపోయాయి. పాండ్యాకు ఇప్పుడు క్రికెట్‌ గురించి తప్ప వేరే ధ్యాసే లేదు. ప్రపంచకప్‌లో టీమిండియాకు పాండ్యా అదనపు బలం. కేఎల్‌ రాహుల్‌ కూడా తన పొరపాట్లను సరిదిద్దుకున్నాడు. జట్టులోకి త్వరలోనే తిరిగొస్తాడని భావిస్తున్నా (తొలిసారి బరిలో పాండ్యా బ్రదర్స్‌!)

ప్రపంచకప్‌లో పాండ్యా తప్పకుండా ఉంటాడు
ఇంగ్లండ్‌ వేల్స్‌ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ ప్రపంచకప్‌లో టీమిండియానే ఫేవరేట్‌. అయితే భారత ప్రపంచకప్‌ జట్టులో పాండ్యా తప్పకుండా స్థానాన్ని సంపాదిస్తాడు. పాండ్యాతోనే టీమ్‌ బ్యాలెన్స్‌గా ఉంటుంది. డెత్‌ ఓవర్లలో బ్యాటింగ్‌ చేయడంలో పాండ్యా దిట్ట, అదేవిధంగా బౌలింగ్‌, ఫీల్డింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. దీంతో ప్రపంచకప్‌లో టీమిండియా ప్రధాన ఆటగాడు పాండ్యా అనడంలో ఎలాంటి సందేహం లేదు.’అంటూ కిరణ్ మోరే పాండ్యా గురించి పలు విషయాలు వెల్లడించారు.
అసలేం జరిగిందంటే..
కాఫీ విత్‌ కరణ్‌ షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌లు వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఇద్దరి ఆటగాళ్లను ఆస్ట్రేలియా పర్యటన నుంచి మొదట్లో అకస్మాత్తుగా స్వదేశానికి పిలిపించి విచారణ చేపట్టారు. తొలుత క్రికెట్‌ పరిపాలక కమిటీ (సీవోఏ) చీఫ్‌ వినోద్‌ రాయ్‌ రెండు మ్యాచ్‌ల నిషేధంతో సరిపెట్టాలని భావించినా, మరో సభ్యురాలు డయానా ఎడుల్జీ న్యాయ సలహాకు పట్టుబట్టారు. దీంతో వీరిద్దరిపై నిరవధిక నిషేధాన్ని విధించారు. కొన్ని రోజుల నాటకీయ పరిణామాల అనంతరం పాండ్యా, రాహుల్‌లపై సీవోఏ నిషేధాన్ని ఎత్తివేసింది. (పాండ్యా.. బంతిని కరణ్‌ అనుకున్నావా?)

మరిన్ని వార్తలు