నిలిపాడు బ్యాట్‌తో... బంతితో...

7 Jan, 2018 01:29 IST|Sakshi

హార్దిక్‌ పాండ్యా  ఆల్‌రౌండ్‌ ప్రదర్శన 

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 209

దక్షిణాఫ్రికారెండో ఇన్నింగ్స్‌ 65/2  

తొలుత బ్యాటుతో నిలిచాడు. భీకర పేస్‌ను కాచుకున్నాడు. ప్రత్యర్థి సహనాన్ని పరీక్షించాడు. వీలుచిక్కితే ఎదురుదాడికి దిగాడు. జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. అనంతరం బంతితోనూ ప్రతాపం చూపాడు. రెండు వికెట్లు తీసి భారత్‌ను పోటీలోకి తెచ్చాడు.  కేప్‌టౌన్‌ టెస్టులో శనివారం హార్దిక్‌ పాండ్యా ప్రతాపమిది. బ్యాట్స్‌మన్‌గా వీరోచిత పోరాటం చేసి, బౌలర్‌గా సఫారీ ఓపెనర్లను పెవిలియన్‌కు పంపి రెండో రోజు ఆటనంతా తనచుట్టూనే తిప్పుకొన్నాడీ యువ ఆల్‌రౌండర్‌. పాండ్యా తెగువతో టీమిండియా తలెత్తుకోగలిగింది. ఇక చేయాల్సింది సమష్టిగా పోరాడి అతడి ఆటకు మరింత విలువ చేకూర్చడమే.  

కేప్‌టౌన్‌: ప్రత్యర్థి ధాటికి బెంబేలెత్తి, ఒక దశలో పూర్తిగా తేలిపోతుందనుకున్న భారత్‌ పర్వాలేదనిపించే ప్రదర్శనతో పరువు దక్కించుకుంది. పేసర్‌ భువనేశ్వర్‌ (86 బంతుల్లో 25; 4 ఫోర్లు) అండగా యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా (95 బంతుల్లో 93; 14 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడైన ఆట కనబర్చడంతో కేప్‌టౌన్‌ టెస్టుపై టీమిండియాకు ఆశలు మిగిలాయి. వీరిద్దరి పోరాటం కారణంగా భారత్‌ 209 పరుగులు చేయగలిగింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన దక్షిణాఫ్రికాను హార్దిక్‌ 2 వికెట్లు తీసి దెబ్బతీశాడు. రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 2 వికెట్లకు 65 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆమ్లా (4 బ్యాటింగ్‌), నైట్‌వాచ్‌మన్‌ రబడ (2 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఓవరాల్‌గా సఫారీ జట్టు 142 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు ప్రత్యర్థిని సాధ్యమైనంత తక్కువకు కట్టడి చేయడంపైనే ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. 

అతి నిదానంగా... 
ఓవర్‌నైట్‌ స్కోరు 28/3తో ఆట ప్రారంభించిన భారత ఇన్నింగ్స్‌ తొలి సెషన్‌ అతి నెమ్మదిగా సాగింది. పుజారా (26), రోహిత్‌ శర్మ (59 బంతుల్లో 11) పరుగులు చేయడం కంటే వికెట్‌ కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో ఫిలాండర్‌ వరుసగా అయి దు ఓవర్లు మెయిడిన్లు వేశాడు. అతడు, రబడ కలిసి రోహిత్‌ను తీవ్రంగా పరీక్షించారు. నిలదొక్కుకునేందుకు గంటపాటు శ్రమించిన రోహిత్‌ చివరకు రబడకే వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ నిర్ణయంపై సమీక్షకు వెళ్లినా ఫలి తం లేకపోయింది. అనంతరం వచ్చిన అశ్విన్‌ రెండు ఫోర్లు కొట్టి స్కోరును కొంత ముందు కు కదిలించాడు. ఈ సెషన్‌లో 25 ఓవర్లలో కేవలం 48 పరుగులు మాత్రమే వచ్చాయి. 76/4తో భారత్‌ లంచ్‌కు వెళ్లింది. 

అందరూ వెంటవెంటనే... 
లంచ్‌ తర్వాతి ఓవర్‌ తొలి బంతికే భారీ షాక్‌ తగిలింది. ఫిలాండర్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్‌ ఇచ్చి పుజారా నిష్క్రమించాడు. స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ అంతా అవుటై... 200 పరుగులపైగా వెనుకబడి... ప్రతిదాడి తప్ప మరో అవకాశం లేని ఈ స్థితిలో వచ్చిన పాండ్యా తొలి బంతినే బౌండరీకి తరలించాడు. స్టెయిన్‌ బౌలింగ్‌లో అంపైర్‌ అవుటిచ్చినా సమీక్ష కోరి మరీ బయటపడ్డాడు. అయితే కొద్దిసేపటికే ఫిలాండర్‌ బౌలింగ్‌లో డికాక్‌ పట్టిన డైవింగ్‌ క్యాచ్‌కు అశ్విన్‌ (12) వెనుదిరిగాడు. సాహాను అద్భుత బంతితో స్టెయిన్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీనిపై రివ్యూ కోరినా నిరాశే ఎదురైంది. టీ అనంతరం మోర్కెల్‌... భువీని వెనక్కు పంపి 99 పరుగుల 8వ వికెట్‌ భాగస్వామ్యానికి తెరదించాడు. దీంతో పాండ్యా మరింత దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అతడి అద్భుత ఇన్నింగ్స్‌కు రబడ ముగింపు పలికాడు. భారీ షాట్‌ కొట్టే యత్నంలో టాప్‌ ఎడ్జ్‌ తాకిన బంతిని డికాక్‌ ఒడిసి పట్టాడు. బుమ్రా (2)నూ అతడే అవుట్‌ చేయడంతో 209 పరుగుల వద్ద భారత ఇన్నింగ్స్‌ ముగిసింది. దక్షిణాఫ్రికాకు 77 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌ను సఫారీ ఓపెనర్లు మర్‌క్రమ్‌ (43 బంతుల్లో 34; 7 ఫోర్లు), ఎల్గర్‌ (54 బంతుల్లో 25; 4 ఫోర్లు) ఆశావహంగా ప్రారంభించారు. నిలకడగా ఆడుతూ 52 పరుగులు జోడించారు. కాసేపట్లో రోజు ముగుస్తుందనగా బౌలింగ్‌కు వచ్చిన పాండ్యా (2/17) వీరిద్దరినీ అవుట్‌ చేశాడు.

భువీ అండగా... 
92/7... మిగిలింది హార్దిక్‌ ఒక్కడే. మహా అయితే మరో 20, 30 పరుగులు చేయగలదేమోనన్న స్థితి నుంచి భారత్‌ తేరుకుందంటే పాండ్యా, భువనేశ్వర్‌ల విలువైన భాగస్వామ్యమే కారణం. పరిస్థితిని గ్రహించి ఓవైపు పాండ్యా బ్యాట్‌ ఝళిపిస్తూ అర్ధశతకం పూర్తి చేసుకోగా... భువీ అతడికి పూర్తి అండగా నిలిచాడు. స్టెయిన్, రబడ, మోర్కెల్‌లను ఎదుర్కొంటూ 34వ బంతికి సింగిల్‌తో పరుగుల ఖాతా తెరిచాడు. కొద్దిసేపటికి వీరిద్దరి మధ్య 50 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అందులో పాండ్యావే 47 పరుగులుండటం విశేషం. పేసర్లతో కావడం లేదని 56వ ఓవర్లో స్పిన్నర్‌ మహరాజ్‌ను బౌలింగ్‌కు దింపగా సిక్స్, ఫోర్‌తో హార్దిక్‌ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో డికాక్‌ స్టంపింగ్‌ అవకాశాన్ని చేజార్చాడు. మరోవైపు భువీ కూడా బ్యాట్‌కు పనిచెప్పాడు. రబడ, స్టెయిన్‌ల బౌలింగ్‌లో నాలుగు ఫోర్లు కొట్టాడు. 185/7తో భారత్‌ టీ విరామానికి వెళ్లింది.

స్టెయిన్‌కు గాయం
దక్షిణాఫ్రికా స్టార్‌ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ మడమ గాయం కారణంగా రెండో రోజు టీ విరామం అనంతరం బౌలింగ్‌కు దిగలేదు. గాయం తీవ్రతను తెలుసుకునేందుకు స్కానింగ్‌ చేయగా... అతనికి నాలుగు నుంచి ఆరు వారాలపాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు. దాంతో అతను ఈ టెస్టులో మళ్లీ బౌలింగ్‌ చేసే అవకాశం లేదు. సిరీస్‌లోని మిగతా రెండు టెస్టుల్లోనూ అతను ఆడేది అనుమానమే.  

మరిన్ని వార్తలు