ఆధిక్యంలో హారిక

11 Jul, 2016 02:08 IST|Sakshi
ఆధిక్యంలో హారిక

చెంగ్డూ (చైనా): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఒంటరిగా ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రపంచ మాజీ చాంపియన్ అంటోనెటా స్టెఫనోవా (బల్గేరియా)తో ఆదివారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌ను హారిక కేవలం 16 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. ఎనిమిదో రౌండ్ తర్వాత హారిక 5.5 పాయింట్లతో ఆధిక్యంలో ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి నాలుగో ‘డ్రా’ నమోదు చేసింది. పియా క్రామ్లింగ్ (స్వీడన్)తో జరిగిన గేమ్‌ను హంపి 47 ఎత్తుల్లో ‘డ్రా’ చేసింది.

హంపి, జూ వెన్‌జున్ (చైనా), స్టెఫనోవా 5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. సోమవారం విశ్రాంతి దినం. మంగళవారం జరిగే తొమ్మిదో రౌండ్‌లో బేలా ఖోటెనాష్‌విలి (జార్జియా)తో హారిక; అనా ముజిచుక్ (ఉక్రెయిన్)తో హంపి తలపడతారు.
 
హరికృష్ణ విజయం: చైనాలోనే జరుగుతున్న డాన్‌జూ సూపర్ గ్రాండ్‌మాస్టర్స్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ తొలి విజయాన్ని సాధించాడు. డింగ్ లిరెన్ (చైనా)తో ఆదివారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో హరికృష్ణ 41 ఎత్తుల్లో గెలిచాడు. మూడో రౌండ్ తర్వాత హరికృష్ణ 1.5 పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు.

మరిన్ని వార్తలు