చాంపియన్‌ హరికృష్ణ

20 Jul, 2020 00:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక బీల్‌ చెస్‌ ఫెస్టివల్‌లో భాగంగా నిర్వహించిన చెస్‌960 టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. కరోనా మహమ్మారి సమయంలో దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత అంతర్జాతీయంగా ముఖాముఖి పద్ధతిలో జరుగుతున్న తొలి చెస్‌ టోర్నీ ఇదే కావడం విశేషం. స్విట్జర్లాండ్‌లోని బీల్‌ నగరంలో ఏడు రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో 34 ఏళ్ల హరికృష్ణ అజేయంగా నిలిచాడు. హరికృష్ణ మొత్తం 5.5 పాయింట్లు స్కోరు చేశాడు.

మైకేల్‌ ఆడమ్స్‌ (ఇంగ్లండ్‌), విన్సెంట్‌ కీమెర్‌ (జర్మనీ), వొజ్తాసెక్‌ (పోలాండ్‌)లతో ‘డ్రా’ చేసుకున్న హరికృష్ణ... అలెగ్జాండర్‌ డోన్‌చెంకో (రష్యా), నోయల్‌ స్టుడెర్‌ (స్విట్జర్లాండ్‌), రొమైన్‌ ఎడువార్డో (ఫ్రాన్స్‌), డేవిడ్‌ గుజారో (స్పెయిన్‌)లపై విజయం సాధించాడు. జర్మనీకి చెందిన 15 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్‌ విన్సెంట్‌ కీమెర్‌ ఐదు పాయింట్లతో రన్నరప్‌గా నిలువగా... 4.5 పాయింట్లతో వొజ్తాసెక్‌ మూడో స్థానాన్ని పొందాడు. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా నిర్వాహకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ముఖాముఖి టోర్నీని నిర్వహిస్తున్నారు. క్రీడాకారులు ఎత్తులు వేసే బోర్డు మధ్యలో ప్రత్యేకంగా అద్దాన్ని అమర్చారు. గేమ్‌లు కాగానే వేదికను, గేమ్‌ బోర్డులను శానిటైజ్‌ చేస్తున్నారు. బీల్‌ చెస్‌ ఫెస్టివల్‌లో భాగంగా ర్యాపిడ్, క్లాసికల్‌ విభాగాల్లో మరో రెండు టోర్నీలు జరగనున్నాయి. 

మరిన్ని వార్తలు