కళ్లు చెదిరే క్యాచ్‌తో సెంచరీని అడ్డుకుంది..

2 Nov, 2019 10:46 IST|Sakshi

ఆంటిగ్వా: వెస్టిండీస్‌ మహిళలతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత మహిళలు పరుగు తేడాతో ఓటమి పాలయ్యారు. వెస్టిండీస్‌ జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేస్తే, భారత్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో 224 పరుగులు చేసి ఆలౌటైంది. దాంతో సిరీస్‌లో శుభారంభం చేసే అవకాశాన్ని భారత మహిళలు తృటిలో చేజార్చుకున్నారు.

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ జట్టులో కెప్టెన్‌ స్టెఫానీ టేలర్‌(94; 91 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నారు. ఏక్తా బిష్‌ వేసిన చివరి ఓవర్‌ ఐదో బంతిని సిక్స్‌ కొట్టిన టేలర్‌..ఆపై మరో బంతిని కూడా సిక్స్‌గా మలిచే యత్నం చేశారు.  లాంగ్‌ ఆన్‌ దిశగా భారీ షాట్‌ కొట్టగా అక్కడే ఉన్న హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అద్భుతమైన టైమింగ్‌తో క్యాచ్‌ను అందుకున్నారు. గాల్లో జంప్‌ కొట్టిన హర్మన్‌ బంతిని ఒడిసి పట్టుకున్నారు. దాంతో టేలర్‌ సెంచరీ చేసే అవకాశాన్ని హర్మన్‌ప్రీత్‌ అడ్డుకోవడంతో విండీస్‌ అభిమానులు నిరాశకు గురయ్యారు.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ మహిళల్లో టేలర్‌కు జతగా నటాషా  మెక్‌లీన్‌(51; 82 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌), చెడియాన్‌ నేషన్‌(43; 55 బంతుల్లో 5 ఫోర్లు)లు రాణించారు. అటు తర్వాత భారత మహిళల్లో ఓపెనర్లు ప్రియా పూనియా(75;107 బంతుల్లో 6 ఫోర్లు), రోడ్రిగ్స్‌( 41; 67 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌)లు శుభారంభాన్ని అందించారు. ఆపై పూనమ్‌ రౌత్‌(22), మిథాలీ రాజ్‌(20), హర్మన్‌ప్రీత్‌(5), దీప్తి శర్మ(19)లు నిరాశపరచడంతో భారత్‌ పోరాడి ఓడాల్సి వచ్చింది.

మరిన్ని వార్తలు