వరల్డ్‌కప్‌లో ఇది స్పెషల్‌ ఇన్నింగ్స్‌!

20 Jul, 2020 15:33 IST|Sakshi

న్యూఢిల్లీ: మహిళల క్రికెట్‌లో వీర విహారం చూడటం చాలా అరుదు. మంచినీళ్లు ప్రాయంలా బౌండరీలు, సిక్సర్లు కొడుతూ ఆస్ట్రేలియాలాంటి ప్రత్యర్థిపై విరుచుకుపడటం ఈజీ కాదు. వరల్డ్‌కప్‌లో ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఆసీస్‌ను చితకబాదటం అంటే మాటలు కాదు.  దీన్ని మూడేళ్ల క్రితమే హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ చేసి చూపించారు. ప్రత్యర్థి బౌలర్లపై సునామీలా చెలరేగిన హర్మన్‌ప్రీత్‌ ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. సరిగ్గా మూడేళ్ల క్రితం(2017, జూలై 20న) ఇదే రోజున ఆసీస్‌పై హర్మన్‌ విరుచుకుపడిన క్రికెట్‌ ప్రేమికులకు అందరికీ సుపరిచితమే. ఆనాటి హర్మన్‌ ఇన్నింగ్స్‌ను, ఆసీస్‌ను సెమీఫైనల్లోనే ఇంటికి పంపించిన తీరును మరొకసారి గుర్తుచేసుకుందాం. (గంగూలీ చేసిందేమీ లేదు!)

మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌కు చిరస్మరణీయ రోజు. ఆసీస్‌కు వెన్నులో వణుకు పుట్టించి ఫైనల్‌కు చేరిన రోజు. ఇందులో హర్మన్‌దే ప్రధాన భూమిక. వర్షం కారణంగా కుదించిన ఆనాటి మ్యాచ్‌లో భారత్‌ 4 వికెట్లకు 281 పరుగుల భారీ స్కోరు సాధించింది. మెరుపు ఇన్నింగ్స్‌తో హర్మన్‌ ప్రీత్‌ కొత్త రికార్డులు లిఖించారు. 115 బంతుల్లో 171 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. 20 ఫోర్లు, 7 సిక్సర్లతో బౌండరీల మోత మోగించారు హర్మన్‌. 

షుట్‌ వేసిన 23వ ఓవర్లో మోకాళ్లపై కూర్చొని కౌర్‌ ఆడిన షాట్‌ ఇన్నింగ్స్‌ హైలైట్‌లలో ఒకటి. ఇదే ఓవర్లో కౌర్‌ను స్టంపౌంట్‌ చేసే సునాయాస అవకాశాన్ని హీలీ చేజార్చింది. ఆ సమయంలో కౌర్‌ స్కోరు 35.  ఆ తర్వాత ఇక ఆమెను ఆపడం ఆసీస్‌ తరం కాలేదు. గార్డ్‌నర్‌ వేసిన 37వ ఓవర్లో కౌర్‌ పండగ చేసుకుంది. తొలి బంతికి శర్మ సింగిల్‌ తీయగా, తర్వాతి ఐదు బంతుల్లో కౌర్‌ 6, 6, 4, 4, 2 బాదడంతో ఆ ఓవర్లో మొత్తం 23 పరుగులు వచ్చాయి. చివరి 10 ఓవర్లలో భారత్‌ ఏకంగా 129 పరుగులు సాధించడం విశేషం. ఆసీస్‌ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ చెలరేగిపోయి పరుగుల వరద పారించిన ఈ పంజాబ్‌ సివంగి భారత్‌కు ఒక గొప్ప విజయాన్ని అందించారు. ఆస్ట్రేలియా 40.1 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. . అలెక్స్‌ బ్లాక్‌వెల్‌ (56 బంతుల్లో 90; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), విలాని (58 బంతుల్లో 75; 13 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించినా ఆసీస్‌కు విజయాన్ని అందించలేకపోయారు. ఆ మ్యాచ్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచిన హర్మన్‌.. ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లో మరే భారత క్రికెటర్‌ కూడా సాధించని ఘనతను తన పేరిట లిఖించుకోవడం మరో విశేషం. (అలవాటులో పొరపాటు.. అంపైర్లకు తిప్పలు)

మరిన్ని వార్తలు