హర్మన్ ప్రీత్ కౌర్ 'నంబర్ వన్' ఆట

21 Jul, 2017 11:54 IST|Sakshi
హర్మన్ ప్రీత్ కౌర్ 'నంబర్ వన్' ఆట

డెర్బీ: మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌కు చిరస్మరణీయ విజయం...  సెమీఫైనల్లో ఆద్యంతం అద్భుతంగా ఆడిన మిథాలీ సేన ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం ఇక్కడ జరిగిన రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ 36 పరుగుల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది.  ఇది మిథాలీ సేనకు అపూర్వమైన విజయం. హార్డ్ హిట్టర్ హర్మన్ ప్రీత్ కౌర్(171 నాటౌట్;115 బంతుల్లో 20 ఫోర్లు, ఏడు సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్ తో విరుచుకుపడి ఆస్ట్రేలియాను కోలుకోనీయకుండా చేసింది.వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో హర్మన్ ప్రీత్ మెరుపు ఇన్నింగ్స్ తో భారత్‌ 4 వికెట్లకు 281 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆపై ఆసీస్ ను  40.1 ఓవర్లలో 245 పరుగులకు కట్టడి చేసి ఆదివారం ఇంగ్లండ్ తో జరిగే తుది పోరుకు భారత్ అర్హత సాధించింది.

విశేషాలు..

మహిళా ప్రపంచకప్లో భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వారి జాబితాలో హర్మన్ ప్రీత్ కౌరే 'నంబర్ వన్'. సెమీస్ లో ఆస్ట్రేలియాపై కౌర్ అజేయంగా సాధించిన 171 పరుగులే భారత్ తరపున అత్యధికం.

మహిళల వన్డే క్రికెట్ లో అత్యధిక స్కోరు జాబితాలో హర్మన్ ప్రీత్ కౌర్ ఐదో స్థానం సాధించింది. ఆసీస్ క్రీడాకారిణి బెలిండా క్లార్క్(229నాటౌట్) తొలి స్థానంలో, భారత క్రీడాకారిణి దీప్తిశర్మ(188) రెండో స్థానంలో ఉన్నారు.

ఇప్పటివరకూ చూస్తే ఈ వరల్డ్ కప్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రీడాకారిణి హర్మన్ ప్రీత్ రెండో స్థానంలో నిలిచింది. శ్రీలంక క్రీడాకారిణి చమారి ఆటపట్టు(178 నాటౌట్) ముందంజలో ఉంది.  ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఆటపట్టు అత్యధిక స్కోరు సాధించింది.

టీమిండియా ఫైనల్ కు చేరడం రెండో సారి. రెండుసార్లు మిథాలీ నేతృత్వంలోనే భారత్ ఫైనల్ కు చేరడం విశేషం. 2005 లో మిథాలీ కెప్టెన్సీలో భారత్ తుది పోరుకు చేరింది.

ఇప్పటివరకూ జరిగిన 11 ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ మహిళలు ఫైనల్ కు చేరకపోవడం మూడోసారి మాత్రమే. అంతకుముందు 1993,2009ల్లో ఆసీసీ ఫైనల్ కు అర్హత సాధించలేదు. ఆసీస్ ఆరుసార్లు వన్డే ప్రపంచకప్ ను అందుకోగా, రెండుసార్లు రన్నరప్ గా నిలిచింది.

మరిన్ని వార్తలు