సీఏఏ: హర్షా బోగ్లే భావోద్వేగ పోస్టు

25 Dec, 2019 16:52 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనలపై ప్రముఖ క్రికెట్‌ కామెంటేటర్‌ హర్షా బోగ్లే స్పందించాడు. ప్రభుత్వం కరుణ కలిగి ఉండాలని.. నవతరాన్ని ఇటువంటి ఒత్తిడుల నుంచి విముక్తుల్ని చేయాలని విఙ్ఞప్తి చేశాడు. మనం ఎంతో మంచి ఇన్నింగ్స్‌ ఆడామని.. ఇప్పటి యువత సైతం అదేవిధంగా మధురానుభూతులు సొంతం చేసుకునే వాతావరణం కల్పించాలని పాలకులకు సూచించాడు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించి ఎన్నికల్లో గెలవాలనుకునే ఆలోచన సరైంది కాదని పరోక్షంగా నరేంద్ర మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించాడు. ఈ మేరకు తన ఫేస్‌బుక్‌ పేజీలో సుదీర్ఘ పోస్టు పెట్టాడు.

‘నవ భారతం ఇప్పుడు మనతో మాట్లాడుతోంది అనుకుంటున్నా. వాళ్లకి ఏం కావాలో దాని గురించి మాత్రమే. చాలా ఏళ్ల క్రితం దేశంపై నాకంటూ కొన్ని కచ్చితమైన అభిప్రాయాలు ఉండేవి. ఇందుకు ఓ కారణం ఉంది. ఇంగ్లండ్‌ పాలనలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి మా తరానికి ఓ అవగాహన ఉంది. ఇక నా తల్లిదండ్రుల తరంలో వారికి కనీస సదుపాయాలు, వనరులు అందుబాటులో లేవు. అంతేకాదు అభిప్రాయాలు చెప్పలేని ఒక భయానక వాతావరణం ఉండేది. అయితే ఇప్పుడు మనం చాలా అదృష్టవంతులం. అలాంటి పరిస్థితి లేదు. స్వేచ్ఛాయుత వాతావరణంలో మన ఆలోచనలు పంచుకునే అవకాశం దక్కింది. అయితే మళ్లీ పురాతన రోజుల్లోకి తీసుకువెళ్లొద్దు.

ప్రభుత్వం దయగా వ్యవహరించాల్సిన సమయం వచ్చింది. విద్య, మౌలిక సదుపాయాలు, సాంకేతికత గురించి ఆలోచించాలి. మన ఆలోచనల స్థాయిని దాటి కొత్తగా ఆలోచిస్తున్న నవతరాన్ని స్వేచ్చగా విహరించేలా చేయాలి. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? వాళ్ల భుజాలపై భారం మోపి ఎందుకు వెనక్కి లాగుతున్నట్టు. మన మధ్య తారతమ్యాల గురించి వాళ్లను ఎందుకు కుచించుకుపోయేలా చేస్తున్నట్టు? వీటన్నింటి వల్లే నవభారతం సంతోషంగా లేదని మనకు చెబుతోంది.(చదవండి : పౌరసత్వ చట్టం: ఎందుకీ ఆందోళనలు?)

మనం పెద్ద పెద్ద భావోద్వేగ పోస్టులు పెట్టనవసరం లేదు. కనీసం ఓ ఐదుగురు యువకుల్ని ప్రోత్సహించండి. వెన్ను తట్టి వారిలో కొత్త ఉత్సాహం నింపండి. ప్రపంచాన్ని కొత్తగా చూసేలా మట్లాడండి. గత మూడేళ్లలో నేను ఇలా చేసి విజయవంతం అయ్యాను. ఇప్పుడు వాళ్లు క్రిక్‌బజ్‌ క్రియేట్‌ చేశారు. కాబట్టి పాలకులారా... నేటి యువత మనం ఆస్వాదించిన స్వాతంత్ర్యం కంటే ఇంకాస్త ఎక్కువ స్వేచ్ఛను పొందేలా చేయండి. వారిని సంతోషంగా, స్వేచ్చా ప్రపంచంలో.. లౌకిక రాజ్యంలో విహరించేలా చేయండి. నా పోస్టు ఎవరినైనా బాధిస్తే క్షమించండి. ఇవి కేవలం నా వ్యక్తిగత ఆలోచనలు మాత్రమే అని హర్ష తన పోస్టులో పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు