'అది క్రికెటర్ల ఫిర్యాదుగా భావించడం లేదు'

11 Apr, 2016 20:47 IST|Sakshi
'అది క్రికెటర్ల ఫిర్యాదుగా భావించడం లేదు'

న్యూఢిల్లీ: ఐపీఎల్-9వ సీజన్ ఆరంభంలోనే ప్రఖ్యాత కామెంటేటర్ హర్షా భోగ్లేను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఆకస్మికంగా తొలగించడం వెనుక కారణాలేమిటన్నదానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వరల్డ్ టీ 20 అనంతరం భారత క్రికెట్ జట్టులోని కొంతమంది సీనియర్ క్రికెటర్లు బోగ్లేపై ఫిర్యాదు చేయడంతోనే అతన్ని కామెంటేటర్ పదవికి ఉద్వాసన పలికారనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే ఈ వార్తలను హర్షా బోగ్లే ఖండించాడు. టీమిండియా క్రికెటర్లు తనపై ఫిర్యాదు చేసి తొలగింపుకు కారణమవుతారని అనుకోవడం లేదన్నాడు. 'వ్యాఖ్యాతగా ఉన్న నేను ప్రతీ క్రికెటర్ గురించి మాట్లాడుతుంటాను. వాళ్లు మెరుగైన ప్రదర్శన ఇవ్వాలనేది నా కోరిక. కామెంటరీతో వారు చేసే పరుగుల్ని, వికెట్లను, క్యాచ్లను ఆపలేను. ఒక యూనివర్శిటీ స్థాయి క్రికెటర్ అయినా వారి గురించి చెప్పడమే నా విధి. అటువంటప్పుడు క్రికెటర్లు నా గురించి ఫిర్యాదు చేస్తారని ఎలా అనుకుంటాను. అది క్రికెటర్ల పని కాదనేది నా బలమైన నమ్మకం' అని హర్షాబోగ్లే పేర్కొన్నాడు.


భోగ్లే కాంట్రాక్టును బీసీసీఐ రద్దు చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కాగా తనను ఎందుకు తొలగించారో కారణం తెలియదని భోగ్లే చెబుతున్నాడు. బీసీసీఐ కూడా కారణం వెల్లడించలేదు. ఐపీఎల్ టోర్నీకి రెండ్రోజుల ముందు వరకు ఆయన కామెంటరీ ప్యానెల్లో ఉన్నాడు. ఫ్లైట్ టికెట్లు కూడా ఒకే అయ్యాయి. ఇంతలోనే తన సేవలు అవసరం లేదని ఈ మెయిల్ పంపినట్టు భోగ్లే వాపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఎందుకు తొలగించారన్నది చర్చనీయాంశంగా మారింది. ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు