గెలిపించని శతకాలు ఇవే..

9 May, 2017 19:59 IST|Sakshi
గెలిపించని శతకాలు ఇవే..

హైదరాబాద్: ఐపీఎల్ అంటేనే బౌండరీల మోత. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయడమే బ్యాట్సమన్ ప్రధాన లక్ష్యం. ఇలాంటి లీగ్ లో ఇక సెంచరీ బాదెస్తే మ్యాచ్ గెలవడం ఎంతో సులభం. కానీ పూర్తిగా బ్యాటింగ్ మద్దతుగా ఉండే ఈ పొట్టి క్రికెట్ లీగ్ లో కొందరు క్రికెటర్లు సెంచరీలు బాదినా మ్యాచ్ లు గెలిపించలేకపోయారు. ఇలా ఐపీఎల్ చరిత్రలో సెంచరీలు బాది జట్టును గెలిపించ లేక పోయినా ఆటగాళ్లపై ఓ లుక్కెద్దాం.

హషీమ్ ఆమ్లా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (2017)
ఆమ్లా ఈ సీజన్ లో రెండు సెంచరీలు బాదాడు. కానీ రెండు మ్యాచుల్లో పంజాబ్ ఓడడం గమనార్హం. ముంబై ఇండియన్స్ పై 60 బంతుల్లో 104 పరుగులతో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఈ సెంచరీ తో పంజాబ్ ముంబై కి 198 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇక గెలుపు కాయం అనుకున్న సందర్భంలో ముంబై కేవలం 15 ఓవర్లలోనే లక్ష్యాన్ని సునాయసంగా చేదించింది. ఆమ్లా సెంచరీ వృధా అయింది. ఇక మరో సెంచరీ గుజరాత్ లయన్స్ పై మరో సారి 104 పరుగలే నమోదు చేశాడు.  ఈ శతకంతో ఒక సీజన్ లో రెండు అంతకన్నా ఎక్కువ సెంచరీలు నమోదు చేసిన మూడో బ్యాట్స్ మన్ గా  ఆమ్లా గుర్తింపు పొందాడు.  పంజాబ్, ఆమ్లా శతకంతో గుజరాత్ కు 190 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించినా గెలువలేక పోయింది. ఆమ్లా రెండు సెంచరీలు బాదినా రెండు మ్యాచుల్లో జట్టు గెలవకపోవడం గమనార్హం.

విరాట్ కోహ్లీ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (2016)
ఐపీఎల్-9 సీజన్లో విరాట్ కోహ్లీ గుజరాత్ లయన్స్ పై రాజ్ కోట్ లో సెంచరీ నమోదు చేశాడు. కానీ ఈ మ్యాచ్ లో బెంగళూరు ఓడిపోయింది. కోహ్లీ 63 బంతుల్లో 100 పరుగులు చేయడంతో బెంగళూరు 180 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని గుజరాత్ 5 బంతులు మిగిలి ఉండగానే చేదించింది. దీంతో ఈ సీజన్ లో సెంచరీ చేసిన జట్టును గెలిపించకపోయినా ఆటగాడిగా కోహ్లీ నిలిచిపోయాడు.

వృద్ధిమాన్ సాహా, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (2014)
ఐపీఎల్-2014  ఫైనల్లో కోల్ కతా నైట్ రైడర్స్ పై సాహా  కెరీర్ లో తొలి సెంచరీ చేసినా జట్టు గెలువలేకపోయింది. సాహా 66 బంతుల్లో 115 పరుగులు చేయడంతో కింగ్స్ పంజాబ్ 199 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఒంటి చేత్తో టైటిల్ అందించాలని భావించిన సాహాకు చివరకు నిరాశే మిగిలింది. కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు మనీష్ పాండే(94)  చెలరేగడంతో పంజాబ్ కు ఓటమి తప్పలేదు. ఇలా ఈ సీజన్ లో సెంచరీ చేసి జట్టును గెలిపించలేక పోయిన ఆటగాడిగా సాహా నిలిచాడు.

సచిన్ టెండూల్కర్, ముంబై ఇండియన్స్(2011)
ఐపీఎల్-2011 సీజన్ లో వాంఖేడ్ స్టేడియంలో సచిన్ టెండూల్కర్ అప్పటి టీం కొచ్చి టస్కర్స్ పై 66 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. సచిన్ 12 ఫోర్లు, 3సిక్సర్లతో చెలరేగడంతో ముంబై 182 పరుగులు చేసింది. కానీ బ్రెండన్ మెకల్లమ్(81), మహేలా జయవర్ధనే(56) ఆట ముందు ముంబై లక్ష్యం చిన్నబోయింది. ఈ సీజన్ లో సెంచరీ చేసి జట్టును గెలిపించలేకపోయిన ఆటగాడిగా సచిన్ నిలిచాడు.

యూసఫ్ పఠాన్, రాజస్థాన్ రాయల్స్ (2010)
ఐపీఎల్-2010 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఆటగాళ్లు అంబటి రాయుడు(55), సౌరభ్ తివారీ(53) లు చెలరేగడంతో  రాజస్థాన్ కు ముంబై 212 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ లక్ష్య చేధనలో తడబడిన రాజస్థాన్ 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో బ్యాటింగ్ కు దిగిన యూసఫ్ పఠాన్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగమైన సెంచరీ నమోదు చేశాడు. యూసఫ్ కేవలం 37 బంతుల్లోనే శతకం బాదాడు. ఈ రికార్డు ఇప్పటి వరకు బ్రేక్ కాలేదు. 173 పరుగుల వద్ద రనౌట్ గా యూసఫ్ వెనుదిరిగాడు. చివర్లో పారాస్ దోగ్రా (41) ప్రయత్నించినా,  రాజస్థాన్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఈ సీజన్లో సెంచరీ వృథా చేసుకున్న బాట్స్ మన్ గా యూసఫ్ నిలిచాడు.

ఆండ్రూ సైమండ్స్, డెక్కన్ చార్జెర్స్ (2008)
ఐపీఎల్ తొలి సీజన్లో రాజస్థాన్ రాయల్స్ పై సైమండ్స్ 53 బంతుల్లో 117 పరుగులు బాదడంతో డెక్కన్ చార్జెర్స్ 214 పరుగులు చేసింది. గెలుపు కాయం అనుకున్న తరుణంలో రాజస్థాన్ బ్యాట్స్ మెన్స్ గ్రేమ్ స్మిత్ (71), యూసఫ్ పఠాన్ (61)  విజృంభించడంతో డెక్కన్ చార్జెర్స్ కు పరాజయం తప్పలేదు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల చేజింగ్ రికార్డుగా నమోదు అయింది. ఈ రికార్డు ఇప్పటి వరకు ఎవరూ అధిగమించకపోవడం గమనార్హం. సెంచరీ వృధా చేసుకున్న ఆటగాడిగా సైమండ్స్ నిలిచాడు.

>
మరిన్ని వార్తలు