పాక్‌ బౌలర్‌ వరల్డ్‌ రికార్డు

6 Oct, 2019 12:07 IST|Sakshi

లాహోర్‌: పాకిస్తాన్‌ యువ పేసర్‌ మహ్మద్‌ హస్నేన్‌ వరల్డ్‌ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంతో జరిగిన తొలిట టీ20లో హ్యాట్రిక్‌ వికెట్లు సాధించి రికార్డు నమోదు చేశాడు. 19 ఏళ్ల వయసులోనే పొట్టి ఫార్మాట్‌లో హ్యాట్రిక్‌ ఘనత సాధించిన బౌలర్‌గా కొత్త అధ్యాయం లిఖించాడు. హస్నేన్‌ 19 ఏళ్ల 183 రోజుల వయసులోనే హ్యాట్రిక్‌ వికెట్లు సాధించాడు. తను ఆడుతున్న రెండో టీ20లోనే ఈ ఫీట్‌ సాధించడం మరో విశేషం. కాగా, అంతకముందు అతి పిన్నవయసులో టీ20లో హ్యాట్రిక్‌ వికెట్లు సాధించిన ఘనత అఫ్గానిస్తాన్‌ యువ సంచలనం రషీద్‌ ఖాన్‌ పేరిట ఉండేది. రషీద్‌ 20 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించగా దాన్ని హస్నేన్‌ బ్రేక్‌ చేశాడు.

లంక తొలుత బ్యాటింగ్‌ చేయగా.. మహ్మద్‌ హస్నేన్‌ తన కోటా నాలుగు ఓవర్లు వేసి 37 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. లంక ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ చివరి బంతికి రాజపక్ష (32)ను హస్నేన్‌ ఔట్‌ చేశాడు. అనంతరం 19వ ఓవర్‌లో తొలి రెండు బంతులకు షనక (17), శహన్‌ జయసూర్య (2)లను ఔట్ చేసి హ్యాట్రిక్‌ నమోదుచేసాడు.  తొలి రెండు ఓవర్లు ఎక్కువ పరుగులిచ్చిన హస్నేన్‌.. అనంతరం పుంజుకుని హ్యాట్రిక్‌  సాధించాడు. అయితే హస్నేన్‌ హ్యాట్రిక్‌ పాక్ విజయానికి సరిపోలేదు. 64 పరుగులతో పాక్ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 165 పరుగులు చేయగా, పాకిస్తాన్‌ 101 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.

మరిన్ని వార్తలు