అమ్మ కూడా చూడాలి!

13 Oct, 2013 08:59 IST|Sakshi
అమ్మ కూడా చూడాలి!

ముంబై: సచిన్ టెండూల్కర్ 24 సంవత్సరాల కెరీర్‌లో అతడి తల్లి రజనీ ఒక్క మ్యాచ్ కూడా మైదానానికి వచ్చి ప్రత్యక్షంగా చూడలేదు. కాస్త ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం. అందుకే చివరిసారి తాను ఆడబోయే టెస్టు (200వ మ్యాచ్)ను తన తల్లి ప్రత్యక్షంగా చూడాలని మాస్టర్ కోరుకుంటున్నాడు.
 
 ప్రస్తుతం ఆమె పూర్తి ఆరోగ్యంగా లేరు. ఒకవేళ మైదానానికి వచ్చినా వీల్‌చెయిర్‌లోనే రావాలి. అటు గురువు ఆచ్రేకర్ కూడా సచిన్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారు. మాస్టర్ ఇప్పటికే వాంఖడేలో తన చివరి మ్యాచ్ ఆడతానని బోర్డును కోరాడు. దీనికి బోర్డు కూడా సానుకూలంగా ఉంది. అయితే రొటేషన్ పాలసీని పక్కనబెట్టి సచిన్ 199వ మ్యాచ్‌ను కోల్‌కతాకు కేటాయించాలని దాల్మియా కూడా బోర్డును కోరారు.
 
 క్రికెట్ ‘పాలన’లోకి వస్తాడు: పవార్
 రాయ్‌గఢ్: సచిన్‌ను క్రికెట్ పాలన వ్యవహారాల్లోకి లేదా కన్సల్టెంట్‌గా తీసుకొచ్చేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, బీసీసీఐ మాజీ చీఫ్ శరద్ పవార్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు సచిన్ నుంచి హామీ కూడా లభించిందని వెల్లడించారు. ‘వీడ్కోలు తర్వాత శుక్రవారం నాడు సచిన్‌తో మాట్లాడా. మున్ముందు భారత క్రికెట్‌ను బలోపేతం చేసేందుకు అడ్మినిస్ట్రేటర్‌గా రావాలని కోరా. దానికి అతను సానుకూలంగా స్పందించాడు. నా విజ్ఞప్తిని మన్నించినందుకు నాకూ సంతోషంగా ఉంది. వీడ్కోలు తర్వాత ఆటకు సేవ చేయడాన్ని మించిన సంతృప్తి ఉండదని చెప్పాడు’ అని పవార్ వ్యాఖ్యానించారు.
 

మరిన్ని వార్తలు