అంధుల క్రికెట్ నుంచీ నేర్చుకున్నా: మాస్టర్

5 Mar, 2014 01:42 IST|Sakshi
అంధుల క్రికెట్ నుంచీ నేర్చుకున్నా: మాస్టర్

మందన్‌గడ్: ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంధుల క్రికెట్ నుంచి కూడా పలు విషయాలను నేర్చుకున్నట్టు తెలిపాడు. మహారాష్ట్రలోని రత్నగిరి సమీపంలోని స్నేహజ్యోతి నివాసి అంధ పాఠశాలను మంగళవారం సచిన్ సందర్శించాడు. ‘15 ఏళ్ల క్రితం ముంబైలో నేను అంధుల క్రికెట్ టోర్నీని ప్రారంభించాను. వారు ఆడే విధానం నన్ను చాలా ఆకట్టుకుంది. ఎందుకంటే శబ్దాన్ని విని స్పందించడంతో పాటు పరుగులు తీయడం, వికెట్లు పడగొట్టడం అబ్బురమనిపించింది. నిజంగా ఇది నమ్మశ క్యం కాని విషయం. అప్పట్లో అది నాకు కొత్త అనుభవం. వెంటనే అక్కడి ఆటగాళ్ల నుంచి కొన్ని విషయాలను నేర్చుకున్నాను’ అని సచిన్ చెప్పాడు.
 
 రిటైరైనా సచినే టాప్!
 న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా, ఇతర సంచలన వార్తలకు కేంద్రబిందువు కాకపోయినా ఆన్‌లైన్‌లో సచిన్ టెండూల్కర్‌కు ఏ మాత్రం ఆదరణ తగ్గలేదు. గత నెల రోజుల కాలంలో ప్రముఖ సెర్చ్ ఇంజిన్ ‘గూగుల్’లో ఎక్కువ మంది వెతికిన భారత క్రికెటర్ల జాబితాలో సచిన్ అందరికంటే ముందున్నాడు. అయితే ఈ జాబితాలో సచిన్ తర్వాతి స్థానం తాజా సంచలనం విరాట్ కోహ్లికి దక్కింది.  మొదటిసారి కెప్టెన్ ధోనిని కోహ్లి వెనక్కి నెట్టడం విశేషం.
 

మరిన్ని వార్తలు