సచిన్‌లో కోపం చూశా... ధోని ఎప్పుడూ ప్రశాంతమే

19 Jan, 2019 00:15 IST|Sakshi

మహి ఓ దిగ్గజం

40 ఏళ్లకోసారే అలాంటి ఆటగాళ్లు వస్తారు

కోహ్లి... రిచర్డ్స్‌ సరసన చేరతాడు

పనిగట్టుకుని విమర్శిస్తే ఎదురుదాడి చేస్తా

టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి  

వన్డే సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనిపై టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. ధోని... భారత క్రికెట్‌  దిగ్గజాల్లో ఒకడిగా నిలుస్తాడని కొనియాడాడు. డకౌట్‌ అయినా, సెంచరీ కొట్టినా, ప్రపంచ కప్‌ గెలిచినా, తొలి మ్యాచ్‌లోనే ఓడినా ఒకే విధంగా స్వీకరించే ధోని స్వభావం తనను ఆశ్చర్యపరుస్తుందని పేర్కొన్నాడు. ఇదే ఊపులో పరోక్షంగా దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గావస్కర్‌ సహా విమర్శకులపై తనదైన శైలిలో మండిపడ్డాడు. ఓ ఆస్ట్రేలియా పత్రికకు రవిశాస్త్రి ఇచ్చిన ముఖాముఖీ అతడి మాటల్లోనే... 

ధోనిని భర్తీ చేయలేం... 
ఆటలో కొనసాగుతున్న కాలంలో సచిన్‌లో కోపాన్ని చూశా. కానీ, ధోనిలో ఇంతవరకు అలాంటిదేమీ కనిపించలేదు. 30–40 ఏళ్లకోసారి మాత్రమే ఇలాంటి ఆటగాళ్లు వస్తారు. బ్యాట్స్‌మన్‌గానే కాదు... మంచి వ్యూహకర్తగా కెప్టెన్‌ కోహ్లిపై భారం తగ్గిస్తాడు. కీపర్‌గా ఆటను అతడు చూసే కోణం వేరు. కుర్రాళ్లతో బాగా ఉంటాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో వారంతా ధోనిని గొప్పగా చూస్తారు. ఈ మొత్తం జట్టు అతడి సారథ్యంలోనే రూపుదిద్దుకుంది. తన స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం. అందుకని భారతీయులకు నేను ఒకటే చెబుతున్నా. ధోని ఆడినంత కాలం ఆస్వాదించండి.  

ఉద్దేశపూర్వకంగా విమర్శిస్తే సహించను 
నిర్ణయాత్మక విమర్శలను నేను స్వీకరిస్తా. కానీ, పనిగట్టుకుని చేశారని అనిపిస్తే మాత్రం అవతలివారు గొప్పవారా? సాధారణ వ్యక్తా? అన్నది కూడా చూడను. వారికి తగిన రీతిలో బదులిస్తా. దీనిపై నా పంథా మారదు. 

సచిన్, కోహ్లి మధ్య... 
సచిన్, కోహ్లిల్లో మీరు గమనించిన పోలికలేమిటని నిన్న ఎవరో అడిగారు. పరుగుల కోసం తాపత్రయం, నెట్స్‌లో తీవ్రంగా శ్రమించడం, జీవితంలో ముఖ్యమైనవి త్యాగం చేయడం, ఎక్కడా రాజీ పడకపోవడం, ఇతరుల లోపాలను ఎత్తిచూపకపోవడం, తప్పులను అంగీకరించడం.. ఇలా చెప్పేందుకు చాలా ఉన్నాయి. సచిన్‌ స్థితప్రజ్ఞుడు. ప్రత్యర్థి ఎవరైనా లెక్కచేయని వివియన్‌ రిచర్డ్స్‌ తరహాలో కోహ్లి బ్యాటింగ్‌లో దూకుడెక్కువ. ఎంత గొప్పగా ఎదిగినా... పరిమితుల్లో ఉంటాడు. జట్టు సభ్యుల విషయంలో చాలా బాధ్యతగా ఉంటాడు. వారికి అతడో అద్భుతమైన రోల్‌ మోడల్‌. 

మరిన్ని వార్తలు