‘ఈ సంక్షోభం చాలా పెద్దది’

19 Mar, 2020 09:59 IST|Sakshi

మాంట్రియల్‌: యావత్‌ ప్రపంచాన్ని  ‘కరోనా’ వణికిస్తున్న తరుణంలో టోక్యో ఒలింపిక్స్‌ జరిపి తీరాలన్న ప్రణాళిక పూర్తిగా బాధ్యతారాహిత్యమని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) సభ్యురాలు ఒకరు మండిపడ్డారు. కెనడాకు చెందిన హేలీ వికెన్‌హెజెర్‌ మాజీ ఐస్‌ హాకీ క్రీడాకారిణి. ఆమె 2002 నుంచి 2016 వరకు జరిగిన నాలుగు ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన కెనడా ప్లేయర్‌. 41 ఏళ్ల హేలీ ఇప్పుడు ఐఓసీ అథ్లెట్స్‌ కమిషన్‌ సభ్యురాలు. మంగళవారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఇప్పుడప్పుడే ఏ నిర్ణయం తీసుకోమని, క్రీడల నిర్వహణకే అడుగులు వేస్తామని ఐఓసీ ప్రకటించింది. హేలీ ట్విట్టర్‌ వేదికగా ఐఓసీ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ‘ప్రస్తుత సంక్షోభం ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌ కంటే పెద్దది. మరో 24 గంటల్లో ఏం జరుగుతుందో... ఎన్ని కరోనా కేసులు బయటపడతాయో... ఎంతమంది చస్తారో తెలియని దుస్థితిలో ఉన్నాం.

ఇంకో 3 నెలల్లో ఏమైనా జరగొచ్చు. ఇప్పటికే ఈ మహమ్మారి వల్ల క్రీడాకారుల సన్నాహకాలు ఆగిపోయాయి. అర్హత పోటీలన్నీ వాయిదా పడ్డాయి. ఓ అథ్లెట్‌గా ప్రస్తుత పరిస్థితి నాకు బాగా అర్థమవుతోంది. ఈ హృదయ విదారక విషాదంలో అథ్లెట్లంతా ఆందోళనతో ఉన్నారు. అలాంటపుడు మనసును ఆటలపై ఎలా కేంద్రీకరించగలరు’ అని తీవ్రస్థాయిలో ట్వీట్‌ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి నెలకొందని, అలాగే ఆటగాళ్ల పరిస్థితి ఉందని, ఎక్కడికక్కడ అన్నీ మూతపడ్డాయని, సామాజిక జీవనమే స్తంభించిపోయిన ఈ స్థితిలో అథ్లెట్లు మాత్రం ఏం చేస్తారని ఆమె ప్రశ్నించింది. ‘క్రీడాకారులు శిక్షణ తీసుకునే పరిస్థితి లేదు. ప్రయాణ సదుపాయాలు లేవు. స్పాన్సర్లు, మార్కెటింగ్‌ వ్యవస్థలేవీ నడవట్లేదు. ఒకవేళ క్రీడల్ని నిర్వహిస్తే మాత్రం దీని వల్ల ఆటగాళ్లకే కాదు... ప్రపంచానికే తీరని అన్యాయం జరుగుతుంది’ అని హేలీ ట్విట్టర్‌లో పేర్కొంది.  

మా జీవితాలతో ఆడుకుంటారా! 

లూసానే: టోక్యో ఒలింపిక్స్‌పై అనుమానాలే కాదు కస్సుబుస్సు కూడా పెరిగిపోతోంది. ఎలాగైనా జరిపి తీరుతామనే ఐఓసీ నిర్ణయాన్ని మేటి అథ్లెట్లు వ్యతిరేకిస్తున్నారు. మరో వైపు తమకు వేరే ప్రత్యామ్నాయమే కనిపించట్లేదని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) తెలిపింది. ‘ఇది అసాధారణ పరిస్థితి. అందుకే దీనికి అసాధారణ పరిష్కారం కనుగొనాలి’ అని ఐఓసీ ప్రతినిధి అన్నారు. మరో వైపు కొందరు మేటి అథ్లెట్లు ఒలింపిక్స్‌ కోసం తమ ప్రాణాలనే పణంగా పెట్టాలా అని విమర్శించడంతో ఐఓసీ స్పందించింది. ‘ఒలింపిక్స్‌ కమిటీ కూడా సరైనా ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తుంది. అథ్లెట్ల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తుంది’ అని ఐఓసీ ప్రతినిధి చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి ప్రత్యామ్నాయమే కనపడట్లేదని, ఈ విపత్కర సమస్యనుంచి బయటపడే పరిష్కారం కూడా దొరకట్లేదని... అందుకే ఆందోళన చెందుతున్నామని ఒలింపిక్‌ పోల్‌ వాల్ట్‌ చాంపియన్‌ కటేరినా స్టెఫానిడి (గ్రీస్‌) పేర్కొంది. ‘ఐఓసీ మా ప్రాణాలకే ముప్పు తెచ్చేలా ప్రవర్తిస్తోంది. ఒలింపిక్స్‌ కోసం శిక్షణలో తలమునకలైతే రోజూ కలిసుండే సిబ్బందితో పాటు కుటుంబసభ్యులు, తోటి ప్రజల ఆరోగ్యంపై ఇది పెను ప్రభావం చూపుతుంది. ఇంకా చెప్పాలంటే ఐఓసీ మమ్మల్ని ప్రమాదంలోకి నెడుతోంది’ అని ఆమె తీవ్రస్థాయిలో ఐఓసీపై ధ్వజమెత్తింది. 

మరిన్ని వార్తలు