‘యువరాజ్‌ బిగ్గెస్ట్‌ డ్రాబ్యాక్‌ అదే’

3 Oct, 2018 09:27 IST|Sakshi
యువరాజ్‌ సింగ్‌(ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌: టీమిండియా వెటరన్‌ ఆటగాడు, ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారిన విషయం తెలిసిందే. కానీ జట్టులోకి వచ్చి తీరుతానని.. పునర్వైభవం సాధిస్తానని యువీ నమ్మకంతో ఉన్నాడు. ఈ క్రమంలో బ్రిటీష్‌ మోడల్‌, యువీ సతీమణి హేజిల్‌ కీచ్‌ తన భర్తపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో యువీ గురించి, వివాహ జీవితం గురించి పలు విషయాలు వెల్లడించారు. ‘యువీ ఒకరిని మాట అనడు, విమర్శించడు ఆ గుణమే నాకు చాలా నచ్చింది. కానీ అదే అతడికి అతిపెద్ద డ్రాబ్యాక్. జట్టులో స్థానం కాపాడుకోవాలన్నా, సుస్థిరం చేసుకోవాలన్నా ఆ రెండూ అవసరమే‌’ అన్నారు.

యువీ గురించి ఇంకా ఏమన్నారంటే..
‘యువీ మంచి మనసున్న వ్యక్తి. ప్రతీ ఒక్కరిలోనూ ప్రతిభను, మంచితనాన్ని మాత్రమే గుర్తిస్తాడు. కానీ వారిలోని చెడు స్వభావం గురించి ఆలోచించడు, పట్టించుకోడు. ప్రస్తుత పిరిస్థితుల్లో యువీ అంత మంచిగా ఉంటే కుదరదు. జట్టులో చోటు దక్కడం లేదని ఎప్పుడూ బాధ పడడు. ఇప్పటికే క్రికెట్‌లో తానేంటో నిరూపించుకున్నాడు. మరోసారి అవకాశం వస్తే తన ఆటతీరుతో అందరికీ సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉన్నాడు. మా వివాహం జరిగిన కొద్ది రోజులకే యువీకి తిరిగి టీమిండియాలో చోటు దక్కింది. విదేశీ టూర్ల నేపథ్యంలో చాలా నెలలు యూవీని చూసే వీలు లేకుండాపోయింది’అంటూ హేజిల్‌ తన మనసులోని మాటలను బయటపెట్టారు. (సింగ్‌ సిక్సర్ల విధ్వంసానికి 11 ఏళ్లు!)

యువీ చివరగా ఆడింది..
ఇప్పటివరకు భారత్ తరపున యువరాజ్‌ సింగ్ 304 వన్డేలాడి 8,701 పరుగులు చేశాడు. అలాగే 40 టెస్టు మ్యాచ్‌లతో పాటు 58 టీ20 మ్యాచ్‌లాడాడు. 2012లో కేంద్ర ప్రభుత్వం నుంచి అర్జున అవార్డుని సైతం అందుకున్నాడు. 2011లో జరిగిన ఐసీసీ ప్రపంచకప్‌లో మ్యాన్‌ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుని కూడా సాధించాడు. భారత్ తరుపున యువరాజ్ సింగ్ చివరగా 2017 జూన్‌ 30న వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆడాడు. ఆ తర్వాత టీమిండియాలో స్థానం కోల్పోయిన యువరాజ్‌.. చోటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అయితే, జట్టులో చోటు దక్కించుకోవాలంటే ముందుగా అతడు యో-యో టెస్టులో పాసవ్వాలి. గతంలో పలుమార్లు  యో-యో టెస్టులో విఫలం కావడంతో ఇక, భారత జట్టులో యువీకి చోటు దక్కడం కష్టమేనని క్రికెట్‌ పండుతులు అభిప్రాయపడుతున్నారు. (అందుకు ఎన్సీఏనే కారణం: యువీ)

చదవండి: అంతదాకా చూస్తా... ఆ తర్వాతే గుడ్‌బై! 

మరిన్ని వార్తలు