లోధా సిఫారసులను అమలు చేస్తాం!

9 Jul, 2018 10:16 IST|Sakshi

నియమావళిలో మార్పులు చేసిన హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: భారత క్రికెట్‌ నిర్వహణలో వివిధ మార్పులను సూచిస్తూ లోధా కమిటీ చేసిన సిఫారసులను తమ సంఘంలో అమలు చేయాలని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) నిర్ణయించింది. వాటిని తమ నియమావళిలో చేరుస్తూ ఆమోదముద్ర వేసింది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన హెచ్‌సీఏ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో లోధా సిఫారసుల్లో విడిగా కొన్ని అంశాల అమలుకు హెచ్‌సీఏ సిద్ధమైనా... అన్నింటికీ ఏకాభిప్రాయం కుదర్లేదు. అయితే ఈసారి పూర్తి స్థాయిలో వాటిని అమలు చేసేందుకు హెచ్‌సీఏ సిద్ధమైంది.

అందు కోసం అసోసియేషన్‌ బైలాస్‌ (నియమావళిలో) కూడా లోధా సిఫారసులను చేర్చారు. రాబోయే రోజుల్లో సుప్రీం కోర్టు లోధా సిఫారసులకు సంబంధించి తుది తీర్పు ఇవ్వనుంది. ఆ తీర్పులో ఏమైనా మార్పులను సుప్రీం ఆదేశిస్తే దాని ప్రకారం మరోసారి నియమావళిని మార్చుకోవాలని కూడా ఎస్‌జీఎంలో హెచ్‌సీఏ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు హెచ్‌సీఏ నియమావళి ప్రకారం తెలంగాణ ప్రాంత పరిధిలోని 10 జిల్లాల్లో క్రికెట్‌ కార్యకలాపాలను హెచ్‌సీఏ పర్యవేక్షిస్తోంది. ఇప్పుడు దీనిని ‘తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలు’గా సవరించారు. సర్వసభ్య సమావేశంలో కొందరు సభ్యుల నుంచి వివిధ అంశాలపై కొంత అభ్యంతరాలు వ్యక్తమైనా... మొత్తంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగానే ముగిసింది. హైకోర్టు నియమించిన మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ సీతాపతి, జస్టిస్‌ అనిల్‌ దవే సమక్షంలో ఈ ఎస్‌జీఎం జరిగింది. దీనిని పర్యవేక్షిందుకు బీసీసీఐ తరఫున రత్నాకర్‌ శెట్టి హాజరయ్యారు.  

మరిన్ని వార్తలు