రక్షణాత్మకంగా ఆడాడు

19 Nov, 2013 00:28 IST|Sakshi
రక్షణాత్మకంగా ఆడాడు

 రెండు వరుస ఓటముల తర్వాత ఆనంద్ ఏడో గేమ్‌ను డ్రా చేసుకోగలిగాడు. చివరి రెండు గేమ్‌లతో పోలిస్తే ఇదేమీ చెత్త ఫలితం కాదు. ఆనంద్ తెల్లపావులతో చావో రేవో అన్నట్లుగా ఆడతాడని భావించా. కానీ రక్షణాత్మకంగా ఆడటానికే మొగ్గు చూపాడు. 12 గేమ్‌ల ఈ టోర్నీలో మరో ఐదు గేమ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో కార్ల్‌సెన్ మూడుసార్లు తెల్లపావులతో ఆడతాడు. ముందుగా ఏడో గేమ్‌లో ఏం జరిగిందో చూద్దాం. ఓపెనింగ్‌ను మార్చకూడదని ఆనంద్ నిర్ణయించుకోవడంతో 1.ఈ4తో గేమ్ మొదలైంది. డీ4 లేదా సీ4తో గేమ్‌ను ప్రారంభిస్తాడని నేను ఊహించా. కానీ విషీ మొదటి దానికే కట్టుబడ్డాడు. గేమ్‌లో ఇప్పటికే మంచి ఫలితాన్ని చూపిస్తున్న బెర్లిన్ డిఫెన్స్ వైపే కార్ల్‌సెన్ మొగ్గు చూపాడు. ఐదో ఎత్తులో ఆనంద్ బీసీ6తో కొత్త వ్యూహాన్ని అవలంభించాడు. నా ఉద్దేశంలో ఇది బలమైన ఎత్తుగడ.

 

గేమ్ సాగుతున్నకొద్దీ చాలా పావులు పరస్పరం చేతులు మారాయి. ఈ దశలో ఆనంద్ కాస్త ఆధిక్యంలో ఉన్నట్లు కనిపించాడు. కానీ కార్ల్‌సెన్ సరైన ఎత్తులతో ఆకట్టుకున్నాడు. చివరకు గేమ్‌లో పురోగతి కనిపించకపోవడంతో 32 ఎత్తుల వద్ద పాయింట్‌ను పంచుకోవడానికి ఇద్దరు ఆటగాళ్లు అంగీకరించారు. ఏడు గేమ్‌ల తర్వాత కార్ల్‌సెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. రెండే గేమ్‌లు గెలిచినా... నాలుగో గేమ్ నుంచే అతను పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. టోర్నీలో పోరాడాలంటే ఆనంద్ వ్యూహాలతో పాటు ఓపెనింగ్‌నూ మార్చాల్సిన అవసరం ఉంది. ఫలితంపరంగానే కాకుండా ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలంటే నేటి మ్యాచ్ చాలా ప్రధానమైంది. మూడో గేమ్‌లో మాదిరిగా ఈ గేమ్‌లోనూ ఆనంద్ ప్రత్యర్థిపై ఒత్తిడి కలుగజేస్తాడని ఆశిద్దాం

మరిన్ని వార్తలు