15 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు..

10 Jun, 2017 18:54 IST|Sakshi
15 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు..

బర్మింగ్హోమ్:చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శనివారం ఇంగ్లండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా 278 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ ఆటగాళ్లలో అరోన్ ఫించ్(68;64 బంతుల్లో 8 ఫోర్లు), స్టీవ్ స్మిత్(56;77 బంతుల్లో 5 ఫోర్లు), ట్రావిస్ హెడ్(71నాటౌట్; 64 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్సర్లు) హాఫ్ సెంచరీలు సాధించి జట్టు గౌరవప్రదమైన స్కోరుకు సహకరించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ను డేవిడ్ వార్నర్-అరోన్ ఫించ్లు ఆరంభించారు. జట్టు స్కోరు 40 పరుగుల వద్ద వార్నర్(21 )తొలి వికెట్ అవుట్ కాగా, ఫించ్ నిలకడగా ఆడాడు.

 

అతనికి కెప్టెన్ స్టీవ్ స్మిత్ నుంచి మంచి సహకారం లభించింది. ఈ జోడి 96 పరుగుల్ని జత చేసి ఆసీస్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఈ క్రమంలోనే అరోన్ ఫించ్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ జోడి కుదురుగా ఆడుతున్న సమయంలో అరోన్ ఫించ్ ను బెన్ స్టోక్స్ పెవిలియన్ కు పంపాడు. ఆపై కొద్ది సేపటికి స్టీవ్ స్మిత్ సైతం అర్థ శతకం చేసిన తరువాత అవుట్ కావడంతో ఆసీస్ తడబడినట్లు కనబడింది. ఆ దశలో ట్రావిస్ హెడ్ అత్యంత నిలకడగా ఆడాడు. వరుసగా వికెట్లు పడుతున్నా హెడ్ కడవరకూ క్రీజ్ లో ఉండటంతో  ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో రషిద్, మార్క్ వుడ్ లు తలో నాలుగు వికెట్లు సాధించారు.


15 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు..

ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మూడొందల పరుగులకు పైగా స్కోరును చేస్తుందని తొలుత భావించినప్పటికీ వరుస వికెట్లును చేజార్చుకుని కష్టాల్లో పడింది. జట్టు స్కోరు 239 పరుగుల వద్ద మ్యాక్స్ వెల్(20)ను ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్.. ఆపై స్వల్ప విరామాల్లో వికెట్లను నష్టపోయింది. ప్రధానంగా 15 పరుగుల వ్యవధిలో ఆసీస్ ఐదు వికెట్లను కోల్పోవడంతో ఆ జట్టు స్కోరులో వేగం తగ్గింది. ఇంగ్లండ్ బౌలర్లు రషిద్, మార్క్ వుడ్లు చెలరేగిపోయి ఆసీస్  భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు.

మరిన్ని వార్తలు