భారత్‌తో తొలి టెస్టు: కష్టాల్లో ఆసీస్‌

7 Dec, 2018 12:50 IST|Sakshi

అడిలైడ్‌: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆసీస్‌ కష్టాల్లో పడింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఆసీస్‌ ఆచితూచి ఆడుతోంది. రెండో రోజు ఆటలో టీ బ్రేక్‌ తర్వాత హ్యాండ్‌స్కాంబ్‌(34), టిమ్‌ పైనీ(5), కమిన్స్‌(10)లు పెవిలియన్‌కు చేరారు. హ్యాండ్‌స్కాంబ్‌, పైనీలు కొద్దిపాటి వ్యవధిలో పెవిలియన్‌ చేరగా, కమిన్స్‌ మాత్రం కాసేపు క్రీజ్‌లో నిలబడి భారత బౌలర్లను నిలువరించాడు.

శుక్రవారం ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్‌ చేపట్టిన ఆసీస్‌.. ఇషాంత్‌ శర్మ వేసిన మొదటి ఓవర్‌లోనే ఫించ్‌ వికెట్‌ను చేజార్చుకుంది. తొలి ఓవర్‌ మూడో బంతికి ఫించ్‌ బౌల్డ్‌ కావడంతో ఆసీస్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది.  కాగా, మార్కస్‌ హారిస్‌-ఉస్మాన్‌ ఖవాజాల జోడి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 45 పరుగులు జత చేసిన తర్వాత హారిస్‌(26) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో మురళీ విజయ్‌కు క్యాచ్‌ ఇచ్చి హారిస్‌ వెనుదిరిగాడు. అటు తర్వాత స్పల్ప వ్యవధిలో షాన్‌ మార్ష్‌(2)సైతం అశ్విన్‌ బోల్తా కొట్టించడంతో ఆసీస్‌ 59 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. మరో 28 పరుగుల వ్యవధిలో ఖవాజా(28) కూడా అశ్విన్‌ బౌలింగ్‌లో ఔట్‌ కావడంతో ఆసీస్‌ 87 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ను నష్టపోయింది.

అయితే హ్యాండ్‌స్కాంబ్‌-ట్రావిస్‌ హెడ్‌లు కుదురుగా బ్యాటింగ్‌ చేయడంతో తిరిగి ఆసీస్‌ గాడిలో పడింది. కాగా, టీ విరామం తర్వాత ఆసీస్‌ స్కోరు 120 పరుగుల వద్ద ఉండగా హ్యాండ్‌స్కాంబ్‌ ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. అటుపై కెప్టెన్‌ పైనీ కూడా పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో ట్రావిస్‌ హెడ్‌తో జత కలిసిన ప్యాట్‌ కమిన్స్‌ ఇన్నింగ్స్‌ను చక‍్కదిద్దే యత్నం చేశాడు. ఈ జోడి 50 పరుగుల జత చేసిన తర్వాత కమిన్స్‌ను బూమ్రా ఎల్బీడబ్యూ చేశాడు. దాంతో ఆసీస్‌ 177 పరుగుల వద్ద ఏడో వికెట్‌ను చేజార్చుకుంది. ఒకవైపు ఆసీస్‌ వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకున్నా ట్రావిస్‌ హెడ్‌ హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆసీస్‌ కోల్పోయిన ఏడు వికెట్లలో అశ్విన్‌ మూడు వికెట్లు సాధించగా, బూమ్రా, ఇషాంత్‌లు తలో రెండు వికెట్లు తీశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ ఏడు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ట్రావిస్‌ హెడ్‌(61బ్యాటింగ్‌), మిచెల్‌ స్టార్క్‌(8 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు.

మరిన్ని వార్తలు